
రాచకొండ పోలీసులు నగర బహిష్కరణ చేసిన దాసరి సురేందర్ @ సూరి అలియాస్ మోహన్ అలియాస్ మునీర్ గా చలామణి అవుతున్న మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ వరంగల్‌లో తిష్ట వేశాడు.. హనుమకొండ లోని భీమారంలో ఓ అద్దె ఇంట్లో ఉంటూ కొత్త తరహా దందాలకు తరలేపాడు.. కొంతమంది ఆకతాయిలను తన వెంటపెట్టుకొని అనేక దారుణాలకు పాల్పడ్డాడు.. అమాయకులను బెదిరించి దోపిడీలకు పాల్పడడం, భూ వివాదాలలో తల దూర్చాడు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట వద్ద వారం రోజుల క్రితం ఓ లారీ డ్రైవర్ ను తుపాకులతో బెదిరించి అతని వద్ద ఉన్న డబ్బు మొత్తం దోసుకుపోయారు.. ఆ లారీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి మొత్తం కూపిలాగి షాక్ అయ్యారు.
ఈ దారుణానికి పాల్పడింది రాచకొండ కమిషనరేట్‌లో నగర బహిష్కరణ చేయబడిన సూరి గ్యాంగ్ అని తెలియడంతో వరంగల్ పోలీసులు షాక్ అయ్యారు.. దీంతో అతని కోసం రెక్కీ నిర్వహించిన టాస్క్ఫోర్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. సూరితో పాటు మరో ఏడుగురు ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. వీరంతా భూపాలపల్లిలో ఒక హత్యకు సుపారి తీసుకున్నట్టుగా గుర్తించారు. ఈ క్రమంలోనే మార్గమధ్యలో శాయంపేట వద్ద లారీ డ్రైవర్ ను గన్ తో బెదిరించి అరెస్ట్ అయ్యారు. సూరితో సహా శ్యామ్ రాజ్, రాహుల్, శివమణి, శివవైభవ్, సామ్రాజ్ క్రాంతి, నితిన్, ఆదిత్యకుమార్ ఠాకూర్ అనే ఏడుగురిని పోలీసులు అరెస్టుచేశారు.. వీరి వద్ద 2 రివాల్వర్లు, 2 కత్తులు, 03 మ్యాగజైన్లు స్వాదీనం చేసుకున్నారు.
అయితే సూరి నేరాల చిట్ట తెలిసిన పోలీసులు అవాక్కయ్యారు.. హైదరాబాద్, సైబరాబాద్ రాచకొండతో సహా ఐదు జిల్లాలలో ఇతనిపై 46 కేసులు ఉన్నాయి.. సుఫారీ హత్య, భార్య హత్య, బావమరిది హత్య, దారిదోపిడి దొంగతనాలు, మర్డర్ కేసులున్నాయి.. అనేక నేరాలతో గ్యాంగ్ స్టర్ అవతారం ఎత్తిన సూరి అలియాస్ సురేందర్ తన నేర చరిత్రను మరింత విస్తరింప చేశాడు. అరెస్టయి జైలుకువెళ్లిన ప్రతిసారి జైల్లో కొత్త దోస్తులతో సరికొత్త నేరాలకు స్కెచ్ వేశాడు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మూడుసార్లు పీడీ యాక్ట్ ఎదుర్కొన్న ఏకైక నేరస్తుడిగా ఇతని పైన ప్రత్యేక ముద్రపడింది.. చిక్కడపల్లి PS, SRనగర్ పిఎస్, LB నగర్ PS లలో సురేందర్ అలియాస్ సూరిపై పీడియాక్ట్ నమోదు అయ్యాయి.. ఎన్నిసార్లు జైలుకు వెళ్లినా ఇతని ప్రవర్తన మారకపోవడంతో ఏప్రిల్ 4వ తేదీన రాచకొండ పోలీసులు ఇతన్ని నగర బహిష్కరణ చేశారు. ఈ క్రమంలోనే హనుమకొండలోని భీమారం ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో నివాసం అంటూ తన కార్యకలాపాలు మళ్లీ కొనసాగించడం మొదలు పెట్టాడు. గంజాయికి బానిసగా మారిన సూరి తనతో పాటు కొంతమంది యువకులను వెంటబెట్టుకొని దారుణాలకు పాల్పడ్డాడు.
గతంలో జైలుకు వెళ్లిన సందర్భంలో పరిచయమైన ఆదిత్యకుమార్ ఠాకూర్ ద్వారా నాలుగు నెలల క్రితం బీహార్ లోని భాగల్పూర్ నుండి రెండు పిస్టల్స్, 9 రౌండ్స్ బుల్లెట్స్, ఒక కత్తి కొనుగోలు చేశాడు. ఇక్కడ మరో గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని వరంగల్ అడ్డాగా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించడానికి మరో రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నాడు.. భూపాలపల్లిలో ఓ హత్యకు సుపారి తీసుకొని స్కెచ్ వేశాడు.. ఈ క్రమంలోనే మాందారి పేట వద్ద లారీ డ్రైవర్ ను తుపాకీతో బెదిరించి దోపిడీలకు పాల్పడ్డాడు.. లారీ డ్రైవర్ ఫిర్యాదుతో శాయంపేట పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలో దిగి సూరితో సహా ఈ ముఠాను అరెస్టుచేసి వారి వద్ద తుపాకులు, కత్తులు, తూటాలు స్వాధీనం చేసుకున్నారు
ఈ గ్యాంగ్ గంజాయి మత్తులో దారుణాలకు పాల్పడినట్లుగా గుర్తించారు.. వీరిపై మరోసారి పీడి యాక్ట్ నమోదు చేస్తామని ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ తెలిపారు.. వరంగల్ నగరంలో ఇలాంటి రౌడీషీటర్ల తోకలు కత్తిరిస్తామని ఎవరైనా సివిల్ వివాదాలు, సెటిల్మెంట్లలో తలదూర్చిన లేదా నేరాలకు పాల్పడిన వారి పైన కఠినచర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.