Warangal: విద్యాశాఖ అధికారుల నిర్వాకం.. టాప్‌ ర్యాంకర్‌కు దక్కని జాబ్‌..! తండ్రి కోసం చిన్నారుల తపన..

| Edited By: Balaraju Goud

Jan 04, 2025 | 1:35 PM

విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం ఓ నిరుద్యోగికి శాపంగా మారింది. ఉపాధ్యాయ ఉద్యోగ అర్హత పరీక్షలో 10వ ర్యాంక్ సాధించినప్పటికీ ఉద్యోగం దక్కలేదు. సాంకేతిక కారణాలతో అనర్హుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తీరా జిల్లా కలెక్టర్ అదేశించినప్పటికీ, రెండు నెలలుగా ఉద్యోగం ఇచ్చేందుకు కాళ్లు అరిగేలా తిరిగిన ఫలితం లేకుండాపోయింది.

Warangal: విద్యాశాఖ అధికారుల నిర్వాకం.. టాప్‌ ర్యాంకర్‌కు దక్కని జాబ్‌..! తండ్రి కోసం చిన్నారుల తపన..
Teacher Job
Follow us on

వరంగల్‌ జిల్లా విద్యాశాఖ అధికారులు చేసిన తప్పిదం ఓ గిరిజన నిరుద్యోగ యువకుడి పాలిట శాపంగా మారింది.. అతన్ని నిరాశకు గురి చేసింది. బాధితుడి పిల్లలు చిన్నారులు చేస్తున్న వినూత్న న్యాయ పోరాటం జనంలో చర్చగా మారింది. అసలేం జరిగింది..? ఆ నిరుపేద గిరిజనుడు ఎలా ఉద్యోగం కోల్పోయాడు..?

కష్టపడి చదుకున్నాడు. మంచి మార్కులతో ఉత్తమ ర్యాంక్ సాధించాడు. కానీ వరంగల్‌ జిల్లా విద్యాశాఖ అధికారులు చేసిన తప్పిదం ఓ గిరిజన నిరుద్యోగ యువకుడి పాలిట శాపంగా మారింది. వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన పాలకుర్తి మహేందర్‌.. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌‌లో డీఎడ్‌ పూర్తి చేశాడు. 2024లో స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (ఎస్జీటీ)లో డీఎస్సీ పరీక్ష రాశాడు. జిల్లా స్థాయిలో 10వ ర్యాంకు వచ్చింది. మెరుగైన ర్యాంకు, రిజర్వేషన్‌ ఉండటంతో మహేందర్‌ ఉద్యోగానికి ఎంపికైనట్టు అధికారుల నుంచి సమాచారం అందింది.

సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ముగిసిన అనంతరం కౌన్సెలింగ్‌ అండ్‌ పోస్టింగ్‌ కోసం మరోసారి విద్యా శాఖ నుంచి పిలుపు వచ్చింది. తీరా కౌన్సెలింగ్‌‌కు వెళ్లగా లిస్టులో పేరు కనిపించలేదు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారిని సంప్రదించడంతో.. స్టేట్‌ ఆఫీసుకు సర్టిఫికెట్లు పంపిస్తే అనర్హుడిగా పేర్కొన్నరంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో తాను రెగ్యులర్‌గా బెంగుళూరు యూనివర్సిటీలో డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌‌లో డీఎడ్‌ చేసినట్టు మహేందర్‌ తెలిపారు. తనతో పాటు వివిధ జిల్లాల్లో చదివిన 20 మంది అభ్యర్థులకు ఇదే డీఎస్సీలో ఉద్యోగాలు వచ్చినట్టు ఆధారాలు చూపాడు. దీంతో ఖంగుతిన్న డీఈవో తప్పిదం జరిగినట్టు తెలుసుకుని మహేందర్‌‌కు ఉద్యోగం వచ్చేందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

గత రెండు నెలలుగా రోజూ DEO కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇదే విషయమై మహేందర్‌ గతంలో కలెక్టర్‌ సత్య శారదా దేవిని కలిశాడు. స్పందించిన జిల్లా కలెక్టర్‌.. డీఈవోను తన కార్యాలయానికి పిలిపించుకుని మహేందర్‌కు న్యాయం చేయాలని ఆదేశించారు. అయినా, రెండు నెలలుగా ఉద్యోగం కోసం డీఈవో కార్యాలయం, స్టేట్‌ ఆఫీస్‌ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు మహేందర్. డీఈవో నిర్వాకంతోనే తనకు ఉద్యోగం రాలేదని బాధితుడు మహేందర్, అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు తన తండ్రికి ఉద్యోగం రావాలంటూ మహేందర్ పిల్లలు సైతం వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే చిన్నారులు వినూత్న రీతిలో న్యాయ పోరాటం చేస్తుండటం జనంలో చర్చగా మారింది. పలక, బలపం పట్టి పాఠశాలల్లో పాటలు నేర్చుకోవాల్సిన చిన్నారులు “మా నాన్నకు జాబ్ ఇవ్వండి” అని వేడుకుంటూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. చిన్నారుల తపన చూసైనా ప్రభుత్వం స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..