పశ్చిమాసియాలో ట్రంపటడుగులు

పఠించేది శాంతి మంత్రం.. ఆచరించేది యుద్ధ తంత్రం..ప్రపంచానికి పెద్దన్ననని తనకు తాను భావించుకునే అమెరికా చాలా దూరం వెళ్లిపోయింది. ఉగ్రవాదంపై పోరు పేరుతో తాను చేస్తున్నది పులి మీద స్వారీ అని ఆ దేశానికి అర్థం కాలేదని అనుకోలేం. అమెరికా ఏమీ చేసినా తన స్వార్థం తప్ప ప్రపంచ ప్రయోజనాలు పట్టవని విశ్లేషకులు భావిస్తుంటారు. కానీ ప్రస్తుత ఆ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రయోజనాలకన్నా సొంత రాజకీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారని ప్రపంచానికి స్పష్టం […]

పశ్చిమాసియాలో ట్రంపటడుగులు

Updated on: Jan 06, 2020 | 5:52 PM

పఠించేది శాంతి మంత్రం.. ఆచరించేది యుద్ధ తంత్రం..ప్రపంచానికి పెద్దన్ననని తనకు తాను భావించుకునే అమెరికా చాలా దూరం వెళ్లిపోయింది. ఉగ్రవాదంపై పోరు పేరుతో తాను చేస్తున్నది పులి మీద స్వారీ అని ఆ దేశానికి అర్థం కాలేదని అనుకోలేం. అమెరికా ఏమీ చేసినా తన స్వార్థం తప్ప ప్రపంచ ప్రయోజనాలు పట్టవని విశ్లేషకులు భావిస్తుంటారు. కానీ ప్రస్తుత ఆ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రయోజనాలకన్నా సొంత రాజకీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారని ప్రపంచానికి స్పష్టం తెలిసిపోయింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు అమెరికాకు ఏ రకంగా చూసినా మేలు చేసేవి కాదు.

గత అధ్యక్షుడు బరాక్ ఒబామా కాలంలో తీసుకున్న నిర్ణయాన్నింటినీ తరగదోడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇందులో భాగంగానే 2015లో ఇరాన్ తో కుదిరిన అణు ఒప్పందం నుంచి 2018లో ఏకపక్షంగా వైదొలిగారు. ఈ విషయంలో ప్రతిపక్ష డెమోక్రాట్ పార్టీతో పాటు అమెరికన్ పౌరులు కూడా వ్యతిరేకంగా ఉన్నారని ఒపీనియన్ పోల్స్ కూడా చెప్పాయి. చివరకు అమెరికా మిత్ర దేశాలు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఒప్పందాన్ని రద్దు చేయకుండా చర్చల ప్రక్రియ ద్వారా మార్పులు చేసుకునే అవకాశం ఉన్నా ఆయన ఆ పని చేయలేదు. ట్రంప్ కు దేశ ప్రయోజనాల కన్నా వ్యక్తిగత స్వార్థమే ముఖ్యమని ఈ విషయంలో స్పష్టంగా తేలిపోయింది.

పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అమెరికా తప్పుల మీద తప్పులు చేయడం గమనించవచ్చు. ఆ తప్పులను సరి చేసుకోడానికి మరిన్ని తప్పులు చేస్తోంది. ముఖ్యంగా 1980వ దశకంలో జరిగిన ఇరాన్- ఇరాక్ యుద్ధం కాలంలో అమెరికా ఇరాక్ పక్షాన నిలిచింది. ఆ సమయంలో యాదృశ్చికంగా అప్పటికి ఇంకా ఉనికిలో ఉన్న సోవియట్ యూనియన్ సైతం అమెరికాతో ప్రచ్ఛన్న యుద్ధాన్ని పక్కన పెట్టి ఇరాక్ పక్షానే నిలబడింది, కారణం ఏమిటంటే 1979లో ఇరాన్ లో వచ్చిన ఇస్లామిక్ విప్లవం పట్ల ఉన్న భయాందోళనే.. ఈ యుద్ధంలో ఇరాన్, ఇరాక్ రెండు కూడా తీవ్రం నష్టపోయాయి. ఆ తర్వాత 1990లో కువైట్ పై ఇరాక్ దురాక్రమణకు దిగడానికి సాకుగా చూపి అమెరికా గల్ఫ్ (పశ్చిమాసియా)లో ప్రత్యక్ష జోక్యం చేసుకుంది. ఈ యుద్ధంలో ఇరాక్ చావుదెబ్బ తినడంతో కువైట్ నుంచి వైదొలగింది. అయినా ఆ దేశ పాలకుడు సద్ధాం హుస్సేన్ పై డేగ కన్ను నీడ వీడలేదు.

2003లో ఇరాక్ దగ్గర ప్రపంచాన్ని విధ్వంసం చేసే అణ్వాయుధాలు ఉన్నాయనే సాకుతో అమెరికా ఆ దేశంపై దాడికి దిగింది. సద్దాం హుస్సేన్ ను గద్దెదింపి, ఉరి తీసి కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదంతా జరిగి 17 ఏళ్లవుతున్నా అమెరికా ఇరాక్ నుంచి ఒక్క అణ్వాయుధాన్ని కూడా కనుగొనలేకపోయింది. ఆ యుద్ధంలో 7 లక్షల మంది ఇరాకీలు చనిపోగా, జనాభాలో ఎంతో మంది వికలాంగులుగా, అనాథలుగా మిగిలారు. యుద్ధంలో ఎంతో మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో స్వదేశంలో విమర్శలు తప్పలేదు. ఈ స్థితిలో ఇరాక్ నుంచి తమ సైనికులను క్రమంగా వెనక్కి రప్పించాలని అమెరికా భావించింది. ఇంతలోనే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల సమస్య మొదలైంది.

ఇరాక్ లో 60 శాతం, సిరియాలో నాలుగోవంతు భూభాన్ని గుప్పిన పెట్టుకొని రక్తపాతం సృష్టించిన ఐఎస్ఐఎస్ పోరులో అమెరికా సంకీర్ణ దళాలు సైతం వెనుకంజ వేసిన పరిస్థితుల్లో పొరుగునే ఉన్న ఇరాన్ క్రియాశీల పాత్ర పోషించింది. ఇరాక్‌లోని కతైబ్‌ హిజ్బుల్లా మిలీషియా, మహ్‌దీ మిలీషియా దళాలు ఐఎస్ఐఎస్ తో సాహసోపేతంగా పోరాడాయి. వీరికి అమెరికాతో పాటు ఇరాన్ కూడా ఆయుధాలు అందించి సాయం చేసింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అణచివేయడంలో ఇరాన్‌ పాత్రను అప్పట్లో అమెరికా గుర్తించింది. నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వంలో విదేశాంగమంత్రిగా ఉన్న జాన్‌ కెర్రీ 2014లో ఇరాన్‌ విదేశాంగమంత్రి మహమ్మద్‌ జరీఫ్‌తో న్యూయార్క్‌లో సమావేశమయ్యారు. వీని ఫలితంగానే 2015లో అమెరికా-ఇరాన్ ల మధ్య అణు ఒప్పందం కుదిరింది. ఈ సాన్నిహిత్యం పశ్చిమాసియాలో అమెరికా మిత్ర దేశాలుగావున్న ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలకు నచ్చలేదు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ రెండు దేశాలు చక్రం తిప్పి ఒప్పందం రద్దు చేయించడంలో విజయం సాధించాయి.

ఇరాన్ తో ప్రత్యక్షంగా కయ్యానికి దిగిన డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా అణు ఒప్పందాన్ని రద్దు చేయడమే కాకుండా ఆ దేశానికి చెందిన ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కోర్ ‌(ఐఆర్‌జీసీ)ను ఉగ్రవాద దళంగా ప్రకటించారు. అంతే కాకుండా ఇరాన్ పై అకారణంగా అనేక ఆంక్షలు విధించారు. ఆ దేశం నుంచి ఏ దేశమూ కొనకుండా నిషేధం విధించారు. భారత్ కూడా అమెరికా వత్తిడికి తలొగ్గక తప్పలేదు.

ప్రస్తుత విషయానికి వస్తే.. తమ దేశంలో 17 ఏళ్లుగా తిష్టేసిన అమెరికా సైన్యాలపై ఇరాక్ లో కూడా విముఖుత పెరిగింది. విదేశీ సైన్యాలు ఇరాక్ ను వదిలి వెళ్లాలని కతైబ్‌ హిజ్బుల్లా మిలీషియా చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది.. ఈ నేపథ్యంలో డిసెంబర్ 27న ఇరాక్‌లోని కిర్కుక్‌లోవున్న అమెరికా సైనిక స్థావరంపై జరిగిన రాకెట్‌ దాడి జరిగింది. ఒక అమెరికా కాంట్రాక్టర్ మరణిస్తే అనేక మంది గాయపడ్డారు ఈ దాడికి కతైబ్‌ హిజ్బుల్లా మిలీషియాదే బాధ్యత అని అమెరికా ఆరోపించగా, ఆ సంస్థ ఖండించింది. దీంతో అమెరికా ఏకపక్షంగా కతైబ్‌ మిలీషియా స్థావరంపై వైమానిక దాడులు జరిపి 24మంది మిలిటెంట్లను హతమార్చింది. ఈ దాడిపై ఆగ్రహించి కతైబ్‌ మిలీషియా బాగ్దాద్ లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని చుట్టుముట్టింది. అక్కడి ఔట్‌పోస్టుకు నిప్పుపెట్టింది. తమ సైనికులపై, దౌత్య కార్యాలయంపై దాడులు అమెరికాకు మరింత ఆగ్రహం తెప్పించాయి. ఇందుకు ప్రతీకారంగానే ట్రంప్ ఆదేశాలతో అమెరికా సైన్యం ఐఆర్‌జీసీ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ కాసిం సులేమానిపై డ్రోన్లతో దాడి చేసి హతమార్చింది.

మేజర్‌ జనరల్‌ కాసిం సులేమాని ఇరాన్‌లో అత్యంత కీలకమైన నేత, మత గురువు అలీ ఖమేనీకి కుడి భుజం. గత 22 ఏళ్లుగా ఐఆర్‌జీసీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఇస్లామిక్‌ స్టేట్ ఉగ్రవాదుల్ని అంతమొందించడంలో సులేమాని పాత్ర అపారంగా ఉంది. మరోవైపు సిరియా ప్రధాని బషీర్‌ అల్‌ అసద్‌ను అంతమొందించాలన్న అమెరికా ప్రయత్నాలను సులేమాని వమ్ము చేశారు. తమ కంటిలో నలుసుగా మారినందునే అమెరికా సులేమానిని హతమార్చింది. ఈ పరిణామం ఇరాన్ కు పుండు మీద కారం పోసినంత కోపం కలిగిస్తున్నాయి. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశం హెచ్చరిస్తోంది. ఇప్పటి వరకూ ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న పరోక్ష యుద్ధం ఇప్పుడు ప్రత్యక్ష పోరుకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి..

ప్రస్తుతం పశ్చిమాసియాలో అమెరికా ఏకాకిగా మారింది. ఇరాక్ నుంచి అమెరికా సైన్యాలు తక్షణం వైదొలగాలని ఇరాన్ కోరుకుంటోంది.. మరోవైపు ఇరాక్ నుంచి కూడా అమెరికాకు మద్దతు లభించడం లేదు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్ని ఎదుర్కొని తమకు మేలు చేసిన కతైబ్‌ హిజ్బుల్లా మిలీషియా విషయంలో ఆ దేశం సానుభూతితో ఉంది. అమెరికా వైమానిక దాడుల్లో మరణించిన 24మంది మిలిటెంట్లకు నివాళిగా మూడు రోజులు సంతాపదినాలు పాటిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిణామాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మింగుడు పడటం లేదు.

ప్రస్తుత 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాలు డొనాల్డ్ ట్రంప్ కొంప ముంచేట్టుగానే కనిపిస్తున్నాయి. నాలుగు దశాబ్దాలుగా జరిగిన పరిణాలను గమనించిట్లయితే.. 1990 ఇరాక్ – కువైట్ యుద్ధ సమయంలో అమెరికా అధ్యక్షునిగా ఉన్నది జార్జిబుష్.. 2003లో ఇరాక్ పై దాడికి దిగింది అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ జానియర్ బుష్.. వీరిద్దరూ తండ్రీ కొడుకులు.. తాజాగా ఇరాన్ లో కయ్యానికి దిగాడు డొనాల్డ్ ట్రంప్.. ఈ ముగ్గురు అధ్యక్షులు రిపబ్లికన్ పార్టీ వారు కావడం యాదృశ్చికమా? లేక గల్ఫ్ లో నిత్యం మంటలు రాజేయడం రిపబ్లికన్ పార్టీ వారి విదేశాంగ విధానమా? అనేది స్పష్టం కావాల్సింది.. ఇరాన్ లో కీలక నేత అయిన సులేమానిని హత్య చేయించి అమెరికా ప్రతిష్టకు మచ్చ తెచ్చిన ట్రంప్ తాజా అధ్యక్ష ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికే స్వదేశంలో అభిశంసన తీర్మాణాన్ని ఎదుర్కొంటున్న ట్రంప్, అమెరికన్ల దృష్టిని మరల్చేందుకు ఆడిన నాటకంలో తానే చిత్తు కానున్నాడా అన్నది కాలమే తేలుస్తుంది.

ఉగ్రవాదంపై పోరు ముసుగులో అమెరికా చేస్తున్న ఈ వికృత విన్యాసాలు ప్రపంచ శాంతికే ప్రమాదకరంగా మారాయి. ఈ పోరాటం కేవలం ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌ లేదా కొన్ని పరిసర దేశాలకు మాత్రమే పరిమితం కాదు.. ఇవన్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెడతాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే భారత్ అపారంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి ఉదాసీన వైఖరి మరింత ఆందోళన కలిగిస్తోంది.

– క్రాంతి దేవ్ మిత్ర