హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.. ఈ క్రమంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని భారతీయ జనతాపార్టీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పదునైన వ్యూహాలతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో పార్టీలో అసమ్మతి మాత్రం చల్లారడం లేదు.. దీంతో అధిష్టానం రంగంలోకి దిగి.. పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, బీజేపీలో కొంతకాలంగా అసమ్మతితో రగిలిపోతున్న విజయశాంతి నుంచి పార్టీ హైకమాండ్ నుంచి క్లారిటీ తీసుకుంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో హాజరయ్యేందుకు వచ్చిన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో విజయశాంతి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవలే బీజేపీ ఎన్నికల ఎఫైర్స్ కమిటీల్లో భాగంగా అజిటేషన్ కమిటీ ఛైర్మన్ గా విజయశాంతికి బాధ్యతలు అప్పగించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని నియమించినప్పటి నుంచి.. విజయశాంతి పార్టీకి కొంచెం దూరంగా ఉంటున్నారు. పార్టీలో ప్రియారిటీ దక్కడం లేదని అసమ్మతి నేతలతో తరుచూ సమావేశమయ్యారు. చాలాకాలంగా ఇన్ డైరెక్ట్ పంచ్‌లతో ట్విట్స్ వదులుతూ.. పార్టీలో కలకలం రేపుతున్నారు. చివరకు పార్టీ హైకమాండ్ పిలిచి మాట్లాడటంతో రాములమ్మ వెనక్కి తగ్గినట్లు సమాచారం.
రాములమ్మ మల్కాజిగిరి పార్లమెంట్ సీటుపై మనుసు పారేసుకున్నారట. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్‌కు చెప్పేశారు. అయితే, ఇదే సీటు కోసం బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు పట్టుబడుతున్నారు. దీంతో ఈ ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. కొందరు నేతలు చిట్ చాట్‌లతో పార్టీని డ్యామేజ్ చేశారని ట్విట్టర్‌లో పదే పదే ప్రస్తావించడం వెనక కారణం ఇదేనని కాషాయ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మల్కాజిగిరి పార్లమెంట్ సీటు కోసం ఇద్దరు నేతలు పోటీపడుతుండటం.. రాములమ్మ అసంతృప్తితో ఉండటం.. ఈ క్రమంలో చివరకు భారతీయ జనతాపార్టీ ఎవరికి అవకాశమిస్తుందనేది పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
పార్లమెంట్ ఎన్నికలకు సమయం చాలా ఉందని.. ముందు అసెంబ్లీ ఎన్నికల కోసం పనిచేయాలని విజయశాంతికి పార్టీ చీఫ్ నడ్డా సూచించినట్లు తెలుస్తోంది. దీంతో రాములమ్మ కాంట్రావర్సీలను పక్కన పెట్టి.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారబరిలో దూసుకువెళ్తారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..