CM Revanth: సీఎం రేవంత్ రిక్వెస్ట్.. స్పందించిన కేంద్రం.. ఏమన్నదంటే..?

తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎరువుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చింది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్.. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని కేంద్ర మంత్రి జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేంద్రం ఎరువుల కొరతను తీరుస్తామని హామీ ఇచ్చింది.

CM Revanth: సీఎం రేవంత్ రిక్వెస్ట్.. స్పందించిన కేంద్రం.. ఏమన్నదంటే..?
Revanth Reddy

Updated on: Jul 09, 2025 | 10:16 PM

సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి కేంద్రం స్పందించింది. తెలంగాణకు యూరియా కోటా పెంచాలని ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌  కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కోరారు. దీన్నిపై కేంద్రం స్పందించింది. తెలంగాణకు యూరియా సహా ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. రాష్ట్ర అవసరాల మేరకు ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి జేపీ నడ్డా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎరువుల విషయంలో తెలంగాణ రైతుల అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధానంగా.. యూరియా కొరత లేకుండా చూస్తామన్నారు. అయితే యూరియాను ఇతర అవసరాలకు వాడకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.

అంతేకాకుండా తెలంగాణలో యూరియా అధికంగా వినియోగించడం వల్ల దీర్ఘకాలిక భూసారం దెబ్బతింటుందని జేపీ నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 రబీతో పోలిస్తే.. 2024-25లో 21శాతం అదనపు యూరియా అమ్మకాలు జరిగాయని గుర్తు చేశారు. 2024 ఖరీఫ్‌తో పోలిస్తే 2025లో ఇప్పటికే 12.4 శాతం అదనపు వినియోగం జరిగిందన్నారు జేపీ నడ్డా. మరోవైపు.. రసాయన ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించడంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌ చేయాలని కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రా కూడా విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయ ఎరువులు, సేంద్రియ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు పీఎం ప్రణామ్‌ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని తెలిపారు.

అదేసమయంలో వ్యవసాయేతర అవసరాలకు యూరియాను మళ్లించకుండా చర్యలు తీసుకోవాలని, వివిధ జిల్లాల మధ్య ఎరువుల సమాన పంపిణీని నిర్ధారించాలని తెలంగాణ అధికారులను కోరారు. ఇక తెలంగాణలోని యూరియా కొరత, రైతుల ఆందోళనలతో ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రి జేపీ నడ్డాను సీఎం రేవంత్‌ కలిశారు. రాష్ట్రంలోని ఎరువులు లభ్యత, కొరతపై చర్చించారు. ఖరీఫ్ సీజన్‌లో జూలై, ఆగస్టుకు యూరియాను నిరంతరాయంగా సరఫరా చేయాలని నడ్డాను కోరారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఎరువుల విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.