ప్రేమ పెళ్లి.. అయినా తప్పని వరకట్నం వేధింపులు.. సూటి పోటీ మాటలు తట్టుకోలేక..

కట్నం కోసం నన్ను వేదిస్తున్నారు.. నేను చనిపోతున్నా.. అన్నకు చివరి ఫోన్ కాల్ తర్వాత వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది. నెన్నెల మండలానికి చెందిన ఓ వివాహిత వరకట్న వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది.

ప్రేమ పెళ్లి.. అయినా తప్పని వరకట్నం వేధింపులు.. సూటి పోటీ మాటలు తట్టుకోలేక..
Dowry Harassment

Edited By:

Updated on: Feb 19, 2026 | 6:32 PM

కట్నం కోసం నన్ను వేదిస్తున్నారు.. నేను చనిపోతున్నా.. అన్నకు చివరి ఫోన్ కాల్ తర్వాత వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది. నెన్నెల మండలానికి చెందిన ఓ వివాహిత వరకట్న వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, అత్తామామలు, ఆడపడుచు నిరంతరం వేధింపులకు గురిచేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె చివరకు తనపై పెట్రోల్ పోసుకుని ప్రాణాలు తీసుకుంది.

నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన మమతను ఆమె బంధువైన తాండూరు మండలం చంద్రపల్లికి చెందిన కంబాల నరేష్ దాదాపు 14 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అనంతరం కొంతకాలం గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లిలో నివసిస్తూ నరేష్ సింగరేణి వన్ ఇంక్లైన్ బావిలో ఉద్యోగం చేసేవాడు. ఇటీవల గంగానగర్‌లో అద్దె ఇంటికి మారారు. కానీ పెళ్లైన నెల రోజుల నుంచే పరిస్థితి మారిపోయింది. భర్త నరేష్‌తో పాటు అత్త చిన్నక్క, మామ భూమయ్య, ఆడపడుచు కవిత కలిసి కట్నం కోసం మమతను వేధించడం ప్రారంభించారు.

తనను అత్తింటి వారు మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని మమత తరచూ తన అన్న మహేష్‌కు ఫోన్ చేసి గోడు వెళ్లబోసుకుంది. దీంతో రెండు నెలల క్రితం ఆమెకు లక్ష రూపాయలు ఇచ్చి పంపించారు. అయినా వేధింపులు ఆగలేదని ఆమె తెలిపారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 16వ తేదీన కూడా మమత తన అన్నకు ఫోన్ చేసి, మళ్లీ కట్నం కోసం వేధిస్తున్నారు.. నన్ను చంపేసే ప్రమాదం ఉందని చెప్పింది. దీంతో అన్న మహేష్ తన బంధువుకు సమాచారం ఇచ్చి ఆమెను మంచిర్యాల సమీపంలోని నస్పూర్ కాలనీలోకి తీసుకువచ్చారు.

మరుసటి రోజు భర్త నరేష్ ఇంటి మెట్ల వద్ద పడి ఉన్నాడని అద్దె ఇంటి యజమాని సమాచారం ఇవ్వడంతో మమత వెంటనే అక్కడి వెళ్లి, అతన్ని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించింది. వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. అక్కడికి వచ్చిన అత్తింటి వారు మమతను మానసికంగా వేధిస్తూ.. నీ వల్లే మా కొడుకు పరిస్థితి ఇలా అయ్యింది అంటూ అన్న మహేష్ ముందే అవమానించడంతో మమత తట్టుకోలేకపోయింది.

మానసికంగా బాధపడుతూ మమత వాష్ రూమ్‌కు వెళ్ళొస్తానని అన్నకు చెప్పి బయటకు వెళ్ళింది. వాష్ రూమ్ కి వెళ్ళిన చెల్లె ఇంకా రాకపోవడంతో అన్న మహేష్ ఫోన్ చేసిన స్పందించలేదు. మంగళవారం (ఫిబ్రవరి 17) మధ్యాహ్నం 3.35 గంటల సమయంలో మమత తన అన్న మహేష్‌కు ఫోన్ చేసి అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేకపోతున్నా.. నేను చనిపోతున్న అన్నా.. అని చెప్పింది. అలా చెపుతుండగానే ఫోన్‌లో ఆమె అరుపులు వినిపించాయి. ఆందోళన చెందిన మహేష్ డయల్ 100కు సమాచారం ఇవ్వగా పోలీసులు లొకేషన్ ట్రేస్ చేసి తీగలగుట్టపల్లి హనుమాన్ నగర్ రైల్వే ట్రాక్ సమీపంలో గుర్తించారు. అక్కడికి చేరుకునేలోపే మమత తనపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని పోలీసు అధికారులు పరిశీలించారు. మమత తండ్రి లింగంపల్లి పోషం ఫిర్యాదు మేరకు భర్త నరేష్‌తో పాటు అత్తింటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us