Telangana: తెలంగాణలో చరిత్ర సృష్టించిన ట్రాన్స్ జెండర్స్.. మెడికల్ ఆఫీసర్లుగా నియామకం..

|

Nov 29, 2022 | 4:10 PM

ప్రాచి రాథోడ్, కొయ్యల రుత్ జాన్ పాల్ మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో మెడికల్ ఆఫీసర్లుగా పోస్టింగ్ పొందారు.

Telangana: తెలంగాణలో చరిత్ర సృష్టించిన ట్రాన్స్ జెండర్స్.. మెడికల్ ఆఫీసర్లుగా నియామకం..
Doctors
Follow us on

ఎందులోనూ మేం తక్కువ కాదంటూ.. తెలంగాణకు చెందిన ట్రాన్స్ జెండర్లు చరిత్ర సృష్టించారు. తాజాగా, ఇద్దరు ట్రాన్స్ జెండర్లు (లింగ మార్పిడి చేయించుకున్న వారు) ప్రభుత్వ వైద్యులుగా ఎంపికయ్యారు. ప్రాచి రాథోడ్, కొయ్యల రుత్ జాన్ పాల్ మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో మెడికల్ ఆఫీసర్లుగా పోస్టింగ్ పొందారు. ప్రభుత్వరంగంలో వైద్యులుగా వీరి నియామకం ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి చారిత్రాత్మక విజయాన్ని సూచిస్తుందని పేర్కొంటున్నారు. అయితే.. వీరిద్దరూ ఈ స్థాయికి చేరుకోవడానికి చాలానే కష్టపడాల్సి వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. మెడికల్ ఆఫీసర్లుగా నియామకం పట్ల ప్రాచి రాథోడ్, కొయ్యల రుత్ జాన్ పాల్ హర్షం వ్యక్తంచేశారు.

కమ్యూనిటీకి గొప్ప రోజు..

రూత్ జాన్‌పాల్ మాట్లాడుతూ.. తాను 2018లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానని.. అప్పటినుంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా.. హైదరాబాద్‌లోని 15 ఆసుపత్రులు తనను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. తన ఐడెంటిటీ వల్లే తిరస్కరిస్తున్నట్టు వారు తనకు చెప్పలేదని.. కానీ.. ఆ విషయాన్ని స్పష్టంగా గమనించానన్నారు. తన ఐడెంటిటీ బయటపడినప్పటి నుంచి ఆసుపత్రులు తన విద్యార్హతను పట్టించుకోలేదని రూత్ జాన్‌పాల్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం రావడంతో తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఇది తన కమ్యూనిటీకి కూడా గొప్ప రోజని తెలిపారు. ఖమ్మం పట్టణానికి చెందిన డాక్టర్ రుత్. మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎంబీబీఎస్ చదివారు.

ఎన్నో కష్టాలతో ముందుకు..

ప్రాచీ రాథోడ్ కూడా దీనిపై హర్షం వ్యక్తంచేశారు. ఎన్నో పరాభావాల్ని ఎదుర్కొని.. ఈ స్థాయికి వచ్చినట్లు తెలిపారు. తాను ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేశానని.. తన ఐడెంటిటీ తెలిసిన అనంతరం ఉద్యోగంలోనుంచి తీసేశారని తెలిపారు. తాను ట్రాన్స్‌జెండర్ అనే విషయం తెలిస్తే, ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్య తగ్గిపోతుందని.. ఆ ఆసుపత్రి యాజమాన్యం తనతో చెప్పిందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇలా ఇద్దరూ ఎన్నో తిరస్కరణలు, అవహేళనల తర్వాత.. 2021లో నారాయణగూడలోని యూఎస్ఏఐడీ ట్రాన్స్‌జెండర్ క్లినిక్ మిత్రలో చేరినట్లు తెలిపారు. కాగా.. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన తొలి ట్రాన్స్‌జెండర్స్‌గా ఇద్దరుూ చరిత్రపుటలక్కడంపై పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..