ఒకే ఊరు.. ఇద్దరూ కానిస్టేబుళ్లే.. ఎంతో చలాకీగా ఉత్సాహంగా ఉండేవారు.. ఎందరికో స్ఫూర్తినిచ్చేలా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించేవారు.. హైదరాబాద్ లో జరిగే మారథాన్‌లో పాల్గొనేందుకు ఇద్దరూ ద్విచక్రవాహనంపై బయలుదేరారు.. ఈ క్రమంలో.. బైపాస్ రోడ్డుపై వస్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మరణించారు.. ఈ ఘోర రోడ్డు ప్రమాదం.. గజ్వేల్ పట్టణంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.. ఈ ఘటన గజ్వేల్ పరిధిలోని జాలిగామ బైపాస్ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున బైక్‌పై కానిస్టేబుళ్లు పరంధాములు (43), వెంకటేశ్వర్లు (42) హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు..
మృతులు సిద్దిపేట జిల్లా పెద్దా కోడూరు, గాడిచర్లపల్లికు చెందిన పరందాములు, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. దౌల్తాబాద్‌లో వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుండగా.. రాయపోల్ పీఎస్‌లో పరందాములు పని చేస్తున్నారు. వీరిద్దరూ పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించేవారని.. నిబద్దతతో పనిచేసేవారని సిద్దిపేట పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కానిస్టేబుళ్ల మృతి పట్ల సీపీ అనురాధ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.. పరంధాములు, వెంకటేశ్వర్లు మృతదేహాలను సందర్శించిన సీపీ.. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలను పరామర్శించారు.. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీనిచ్చారు.
కాగా.. ఇద్దరు కానిస్టేబుళ్ల మృతిపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటానని భరోసా ఇచ్చారు.. ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..