హైదరాబాద్, జనవరి 1: రాష్ట్రంలో రేవంత్ సర్కార్ అమలులోకి వచ్చిన మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో బస్సులన్నిటిలో రద్దీ పెరడగంతో టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ నిర్ణయం ఈ ఏడాది జనవరి 1 (సోమవారం) నుంచి అమల్లోకి రానుంది. టికెట్ల జారీకి కండక్టర్లకు అధిక సమయం పట్టడం, సర్వీసుల ప్రయాన సమయం కూడా పెరగడంతో ప్రయాణికులకు అసౌకర్యం కలిగించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. దీంతో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పూర్తి టికెట్ ధరతో ప్రయాణించాల్సి ఉంటుంది.
కొద్దివారాల క్రితం వరకు రహదారులపై ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఎదురుచూసింది. బస్సుల్లో సీట్లు నిండటం కోసం ఫ్యామిలీ-24, టీ-6 వంటి రాయితీ టికెట్లను ప్రవేశపెట్టింది. అయితే తాజాగా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టడంతో పరిస్థితి పూర్తిగా మారింది. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఇప్పుడు ప్రయాణికులే బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తిని తెలిపే ఓఆర్ (ఆక్యుపెన్సీ రేషియో) దాదాపు 20 శాతం పెరిగింది. గతంలో 69 ఉండేది. ఇప్పుడది 89కి చేరింది. ప్రయాణికుల ఎదురుచూపులతో ఆర్టీసీకి డిమాండ్ పెరిగింది. దీంతో ఫ్యామిలీ-24, టీ-6 రాయితీ టికెట్లను ఉపసంహరించుకున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
ఫ్యామిలీ-24, టీ-6 టికెట్ల జారీ సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. ‘ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్ చూడాలి. వారి వయసు నమోదుచేయాలి. దీంతో ఈ టికెట్ల జారీ సమయం కూడా పెరుగుతోంది. అందుకే ఉపసంహరిస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకూ రూ.300 చెల్లించి ఫ్యామిలీ-24 టికెట్ తీసుకుంటే.. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు హైదరాబాద్ నగరమంతా 24 గంటల పాటు సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణించడానికి అవకాశం ఉండేది. అలాగు రూ.50 చెల్లించి టీ-6 టికెట్ తీసుకుంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ప్రయాణ సౌకర్యం ఉండేది. అంటే ఆరు గంటల పాటు హైదరాబాద్‌లో సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు అమలైంది. తెలంగాణ ఆర్టీసీ తాజా నిర్ణయంతో ఈ సదుపాయం ఇకపై రద్దుకానుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.