టీఆఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ నుంచే ప్రవీణ్, రాజశేఖర్ ఆధీనంలో టీఆఎస్‌పీఎస్‌సీ కంప్యూటర్ వ్యవస్థ ఉన్నట్లుగా సమాచారం. విడుదలైన ప్రతీ పేపర్ లీక్ చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సిట్ అధికారులు. ఇప్పటి వరకు గ్రూప్ 1, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్,సీడీపీఓ, సూపర్ వైజర్ గ్రేడ్ 2, ఏఈఈ, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, ఏఈ, ఏడు పరీక్షలు నిర్వహించింది TSPSC. లీకేజ్‌పై నిగ్గు తేల్చే పనిలో సిట్ ఉన్నట్లుగా సమాచారం. టాప్ మార్క్స్ వచ్చిన ప్రతీ ఒక్కరినీ విచారిస్తున్నారు సిట్ అధికారులు.
పేపర్ లీకేజీ, రద్దు, వాయిదాల క్రమంలో ప్రశ్నపత్రాలను కొత్తగా రూపొందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నిపుణులతో సంప్రదింపులు, కొత్త ప్రశ్నపత్రాల తయారీ, అందులో ఇప్పటికే రూపొందించిన ప్రశ్నపత్రాలతో సంబంధం లేకుండా ప్రశ్నల ఎంపిక, వివిధ దశల్లో ఆమోదం, పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు వంటి కార్యాచరణపై కసరత్తు చేస్తోంది.
ఇదంతా పూర్తయ్యేందుకు రెండు నెలల సమయం పడుతుందని అంచనా. రద్దయిన పరీక్షలను ముందుగా నిర్వహించాలంటే.. ఇప్పటికే నిర్దేశించిన ఇతర పరీక్షల తేదీల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని భావించినా.. రద్దయిన, వాయిదా పడిన పరీక్షలకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ పరీక్షల షెడ్యూళ్లలో మార్పులు చేసి.. కొత్త తేదీలను ప్రకటించాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టైన నిందితులను శుక్రవారం కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. నిందితులను పది రోజుల కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసులు పిటీషన్ వేయగా కోర్టు ఆరు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించింది. ఇప్పటికే రెండు రోజులు గడిచిపోయింది.
ప్రవీణ్‌కుమార్, అట్ల రాజశేఖర్ రెడ్డి, రేణుక రాథోడ్, డాక్య, కేతావత్ రాజేశ్వర్, కేతావత్ నీలేష్ నాయక్, పత్లావత్ గోపాల్ నాయక్, కేతావత్ శ్రీనివాస్, కేతావత్ రాజేంద్రన నాయక్‌ను చంచల్‌గూడ జైలు నుంచి సిట్ కార్యాలయానికి.. అక్కడి నుంచి టిఎస్‌పిఎస్‌సి కార్యాలయానికి తీసుకుని వచ్చి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం