టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు ఇన్వెస్టిగేషన్‌లో స్పీడ్ పెంచారు. ఈ కేసులో ఏ ఒక్క ఆధారాన్ని వదలకుండా జల్లెడ పడుతున్న సిట్ బృందం.. టీఎస్‌పీస్‌సీ ఛైర్మెన్ స్టేట్మెంట్ సైతం రికార్డ్ చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో.. నిందితులను రెండు దఫాలుగా కస్టడీకి తీసుకున్న సిట్.. అన్ని కోణాల్లో విచారించారు. టీఎస్‌పీఎస్‌సీలో ఉద్యోగం చేస్తూ.. గ్రూప్ 1 పరీక్ష రాసిన షమీమ్, రమేష్ లతో పాటు మాజీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ లకు ఐదు రోజుల కస్టడీ ముగియడంతో సోమవారం ఉదయం సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం చెంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ ముగ్గురికీ కస్టడీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే.. కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇంఛార్జి శంకర లక్ష్మిని కూడా పలుసార్లు విచారించారు. టీఎస్‌పీఎస్‌సీలో ఉద్యోగుల నిర్లక్ష్యంపై దృష్టి సారించిన సిట్.. బోర్డ్ సభ్యులను సైతం విచారించి, వారి వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. షమీమ్ నివాసంలో జరిపిన సోదాల్లో.. ఏకకంగా మాస్టర్ ప్రశ్నాపత్రం లభించడంతో.. టీఎస్‌పీఎస్‌సీలో ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని సిట్ గుర్తించింది.
టీఎస్‌పీఎస్‌సీ సెక్రటరీ, బోర్డ్ మెంబర్ లను విచారించిన సిట్ అధికారులు.. సోమవారం నాడు టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రశ్న పత్రాల తయారీ, వాటి నిర్వహణ, భద్రత లాంటి అంశాలపై ఛైర్మెన్ నుంచి వివరాలు సేకరించారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయానికి వచ్చిన సిట్ అధికారులు.. సాయంత్రం 6.45 వరకు అంటే దాదాపు మూడు గంటల పాటు ఛైర్మెన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలోనీ ఉద్యోగుల పనితీరు, కాన్ఫిడెన్షియల్ రూమ్‌లో జరిగే యాక్టివిటీస్ అన్నింటి గురించి ఛైర్మెన్ నుండి వివరాలు సేకరించింది సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్‌తో కూడిన బృందం. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్ , రాజశేఖర్ లు ఆఫీస్‌లో చేసిన పని తీరు గురించి ఛైర్మెన్ నుంచి వివరాలు సేకరించారు.
ప్రవీణ్, రాజశేఖర్ ల ల్యాప్ టాప్ సమాచారాన్ని మరోసారి పరిశీలించారు సిట్ అధికారులు. రెండ్రోజుల క్రితం టీఎస్‌పీఎస్‌సీ సెక్రటరీ అనిత రామచంద్రన్, బోర్డు మెంబర్ బండి లింగారెడ్డి ని విచారించిన సిట్.. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత చైర్మన్ జనార్దన్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సెక్రటరీ, బోర్డ్ మెంబర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చైర్మన్ నుంచి మరింత అదనపు సమాచారంతో 161 స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అధికారులు. టీఎస్‌పీఎస్‌సీలో పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల రూపకల్పన ఎలా జరుగుతుంది? ఎన్ని సెట్ల ప్రశ్నపత్రాలు తయారు చేస్తారు? ఇవి ఎవరి ఆధీనంలో ఉంటాయి? అన్న అంశాలకు సంబంధించిన వివరాలను కూడా చైర్మన్ జనార్దన్ రెడ్డి నుంచి సేకరించారు సిట్ అధికారులు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ యాక్సెసబిలిటీ ఎవరెవరికి ఉంటుందనే విషయాలను ఆయన్ని అడిగి తెలుసుకున్నారు.
టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలో ఛైర్మెన్ జనార్ధన్ రెడ్డి నుంచి సిట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న సమయం లోనే.. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పరీక్ష కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వద్దకు వచ్చారు. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పరీక్ష పై అభ్యర్థుల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రవీణ్, రాజశేఖర్‌ల పెన్ డ్రైవ్‌లో AMVI పరీక్షా ప్రశ్నాపత్రం కూడా వుండటంతో.. ఈ నెల 23 న జరగాల్సిన పరీక్షపై టీఎస్‌పీఎస్‌సీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 23 న జరగాల్సిన పరీక్షను వాయిదా వేసి.. తదుపరి తేదీని త్వరగా ప్రకటించాలనీ అభ్యర్థులు డిమాండ్ చేశారు. రాత్రికి రాత్రి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోమని చెబితే.. ఎనిమిదేళ్లుగా ఈ పరీక్ష కోసం ఎదురు చూస్తూ.. ప్రిపేర్ అవుతున్న తమ పరిస్థితి ఏంటి? అంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రశ్నాపత్రం లీకేజీ కేసుకు సంబంధించి FSL రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు సిట్ అధికారులు. పూణే ల్యాబ్ నుంచి FSL రిపోర్ట్ వస్తే మరికొంత మంది బండారం బయటపడే అవకాశముందని భావిస్తున్నారు. ఇక ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు తిరుపతయ్య, ప్రశాంత్, రాజేందర్ లను మూడు రోజుల పాటు సిట్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. మంగళవారం ఉదయం చంచల్ గూడా జైలు నుండి ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఈ నెల 6 వరకు ఈ ముగ్గురి కస్టడీ కొనసాగనుండటంతో మరికొందరి పాత్ర బయటపడే అవకాశాలు లేకపోలేదు. రేణుక భర్త డాఖ్యా నాయక్ నుండి ప్రశ్నాపత్రం పొందిన తిరుపతయ్య.. దానిని ప్రశాంత్, రాజేందర్ లకు ఇచ్చాడు. ఈ ముగ్గురి నుండి ఇంకా ఎవరికైనా చేరిందా అన్న కోణంలో విచారించనున్నారు సిట్ అధికారులు.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడి.. నిందితులను కస్టడీకి తీసుకోవాలని భావిస్తోంది. ఇదే అంశంపై మంగళవారం నాడు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనుంది ఈడి. కోర్ట్ అనుమతితో జైల్లోనే నిందితులను విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. పేపర్ల లీక్ వ్యవహారంలో రూ. 25 లక్షలు లావాదేవీలపై ఫోకస్ చేసింది ఈడి. అలాగే సిట్ నుండి కూడా వివరాలు తీసుకోనుంది ఈడి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..