తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో తవ్వేకొద్దీ వాస్తవాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్, పేపర్ లీకేజీ సూత్రధారి రేణుక, ఆమె భర్త, సోదరుడితో సహా ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా పోలీసుల దర్యాప్తులో మరో కీలక విషయం బయటపడింది. టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష ప్రశ్నపత్రాలు మాత్రమే కాకుండా మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీరింగ్ క్వశ్చన్ పేపర్ కూడా లీకైనట్లు పోలీసులు గుర్తించారు. పరీక్షకు రెండు రోజుల ముందే ప్రశ్నాపత్రం లీకైనట్లు దర్యాప్తులో బయటపడింది. దీంతో అసిస్టెంట్ ఇంజినీరింగ్ పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
యువతి కోసం టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్ పేపర్ లీక్ చేస్తే.. ఆమె మాత్రం బయట క్వశ్చన్ పేపర్‌లను బేరానికి పెట్టింది. ఒక్కొక్కరికి రూ.14 లక్షల చొప్పున ముగ్గురికి ప్రశ్నాపత్రాలను అమ్మినట్లు దర్యాప్తులో బయటపడింది. ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన ముగ్గురు అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మరో వైపు యువతి తమ్ముడు తన కోసమే ఇదంతా చేసిందని చెబుతున్నాడు. అసలు ఈ వ్యవహారం ఎక్కడ మొదలైంది.. ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.