
Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించడంతో ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న సీఎం కేసీఆర్.. అక్టోబర్ 15న (ఆదివారం) పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి.. తెలంగాణ రాష్ట్రంలో విస్తృత పర్యటనలకు శ్రీకారంచుట్టారు. అటు బీజేపీ, కాంగ్రెస్ కూడా ప్రచార పర్వంపై ఫుల్ ఫోకస్ పెట్టాయి. తెలంగాణలో పార్టీ విజయమే లక్ష్యంగా.. ఆ పార్టీల జాతీయ నేతలు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ వారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ నెల 18న వారిద్దరూ జగిత్యాలలో పర్యటించనున్నారు. ముందుగా కొండగట్టు అంజన్నను దర్శించుకుని తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా వారి వెంట కొండగట్టు ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రం జగిత్యాలలో బహిరంగ సభలో పాల్గొంటారు. రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, జగిత్యాల జిల్లా పార్టీ నేతలు తలమునకలయ్యారు. జగిత్యాలలోని కొత్త బస్టాండ్ వద్ద ఆ రోజు సాయంత్రం రాహుల్ గాంధీ రోడ్ షో నిర్వహించనున్నారు.
కొండగట్టు ఆలయాన్ని 18 తేదీన మధ్యాహ్నం రాహుల్ గాంధీ దర్శించుకుంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడ పూజల అనంతరం ప్రచార రథాల(బస్‌లు) ను రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని తెలిపారు. కొండగట్టు నుంచి ప్రచారరథంలో రాహుల్ గాంధీ జగిత్యాలకు చేరుకుంటారని వివరించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నేతలు భారీ జనసమీకరణ చేపట్టనున్నారు. అక్టోబర్ 18 నుంచి 20 తేదీ వరకు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తారని తెలుస్తోంది.
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం తెలిసిందే. మరో నాలుగు రాష్ట్రాలతో కలిసి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును డిసెంబరు 3న చేపట్టనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్‌ను ఓడించి అధికార పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్.. ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ఇప్పటికే ఆరు జనాకర్షక హామీలను ప్రకటించింది. తెలంగాణలో బీజేపీ రేసులో లేదని.. తమ పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఇవే.
కాంగ్రెస్ గ్యారంటీ కార్డు
1) మహాలక్ష్మి పథకం:
👉 మహిళలకు ప్రతీ నెల ₹2500,
👉 కేవలం ₹500 కే వంట గ్యాస్ సిలిండర్,
👉 ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం.2) రైతు భరోసా పథకం:
👉 ప్రతీ ఏటా రైతులకు & కౌలు రైతులకు ఎకరానికి ఏడాదికి ₹15,000.
👉 ₹12,000 వ్యవసాయ కూలీలకు.
👉 వరి… pic.twitter.com/rZ9aTcaq4h— Telangana Congress (@INCTelangana) October 14, 2023
కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..
తెలంగాణలో పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఉదయం ఖరారు చేసింది. మొత్తం 55 మంది అభ్యర్థులకు తొలి జాబితాలో చోటు కల్పించారు. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఉత్తమ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, ఆయన తనయుడు మైనంపల్లి రోహిత్ తదితరులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
The Indian National Congress has released the first list of candidates for the Telangana Assembly elections, 2023. pic.twitter.com/KH2CzHK4iV
— Congress (@INCIndia) October 15, 2023