పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బీజేపీ నేతలు దొంగ బుక్కులు తయారుచేసి రామ మందిరం పేరిట చందాలు వసూలు చేస్తున్నారని చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారక ముందే మరోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఆ కులం ఆఫీసర్లకు అక్షరం ముక్కరాదు.. ఎక్కడ చూసినా వాళ్లే.. వారి వల్లే రాష్ట్రం నాశనం అవుతుంది అంటూ హన్మకొండలో జరిగిన ఓసీ జేఏసీ సభలో కొన్ని కులాలను ఉద్దేశించి ధర్మారెడ్డి కామెంట్ చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ సంఘాలు భగ్గుమన్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ధర్మారెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశాయి. దీంతో ఎమ్మెల్యే.. యూ టర్న్ తీసుకున్నారు.
తాను చేసిన వ్యాఖ్యలు ఎవరి మనసునైనా నొప్పిస్తే వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెబుతున్నానని ధర్మారెడ్డి అన్నారు. తన వ్యాఖ్యల ఉద్దేశం ఎవరినీ అవమానించడం కాదన్నారు. అన్ని కుల సంఘాలకు సారీ చెబుతున్నానని ఇంతటితో ఈ విషయం వదిలివేయాలని ధర్మారెడ్డి కోరారు.