
Adilabad, October 05: ఆదివాసీల నిరసనలతో ఆదిలాబాద్ నివురు గప్పిన నిప్పులా మారింది. జల్ జంగిల్ జమీన్ అంటూ ఆదివాసీలు మరోసారి జంగ్ సైరన్ మోగించడం.. తమ భూములకు పట్టాలిప్పించాలంటూ డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ నుండి ప్రగతి భవన్ కు మహా పాదయాత్ర చేపట్టడం.. ఆ యాత్రను పోలీసులు భగ్నం చేయడం ఇందుకు కారణమైంది. అక్టోబర్ 2 న ఆదిలాబాద్ జిల్లా మావల మండలం కొమురంభీం కాలనీ నుండి మొదలైన మహాపాదయాత్ర నేరడిగొండకు చేరుకోగానే అక్టోబర్ 4 బుదవారం అర్థరాత్రి పోలీసులు పాదయాత్రను భగ్నం చేయండతో ఆదివాసీలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను భగ్నం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మావల బైపాస్ వద్ద జాతీయ రహదారి 44 పై బైటాయించి ఆందోళనకు దిగారు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. కొమురంభీం కాలనీ ఆదివాసులకు పట్టాల విషయంలో స్పష్టమైన హామీ వచ్చేంత వరకు ఆందోళన ఆపమంటూ తేల్చి చెప్పారు తుడుందెబ్బ నేతలు
ఆదివాసీ హక్కులను కాపాడాలనీ.. అర్హులందరికీ ఇళ్లస్థలాలు, స్థలాలున్న వారికి పట్టాలు ఇవ్వాలనీ డిమాండ్ చేస్తూ తుడుందెబ్బ ఆద్వర్యంలో ఆందోళనకు దిగారు. శాంతియుతంగా సాగుతున్న మహా పాదయాత్రను నేరడిగొండ వద్ద భగ్నం చేసి ఆదివాసీలను అర్థరాత్రి నుండి నిర్బందించడాన్ని వ్యతిరేకిస్తూ తుడుందెబ్బ నేతలు రోడ్డెక్కారు. పది గంటలుగా 150 మంది ఆదివాసీలను పాదయాత్ర నుండి అరెస్ట్ చేసి ఆదిలాబాద్ కు తరలిస్తామంటూ బస్ లో తీసుకొచ్చి మావల వద్దే నిలిపి వేశారని.. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పకుండా అటు పోలీస్ స్టేషన్ కు సైతం తరలించకుండా నిలిపి వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అదుపులో ఉన్న ఓ మహిళ అస్వస్థకు గురవడంతో ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో పక్కనే ఉన్న జాతీయ రహదారిపై బైటాయించి నిరసనకు దిగారు. తమను కలెక్టరేట్ కు తరలించాలని.. లేదంటే ప్రగతి భవన్ కు పాదయాత్రగా వెళ్లేందుకు అనుమతివ్వాలని లేదంటూ ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివాసీలు. ఘటన స్థలానికి చేరుకున్న ఆదిలాబాద్ డీఎస్పీ ఉదయ్ రెడ్డి ఆందోళనకారులకు నచ్చ జెప్పి కలెక్టరేట్ కు తరలించడంతో మహా పాదయాత్ర ఆందోళనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
కలెక్టరేట్ తో చర్చించిన తర్వాత సరైన హామీ లభించకపోతే తమ తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని ఆదిలాబాద్ ఆదివాసీ తుడుందెబ్బ అద్యక్షుడు గెడం గణేష్ తెలిపాడు. కొమురంభీం కాలనీలోని సర్వే నెంబర్ 72 లోని 80 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆదివాసీలకు అందించి.. పట్టాలు ఇవ్వాలని.. గృహలక్ష్మి పథకం కింద నిదులు విడుదల చేసి ఆదివాసీలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ ఉద్యమ తీవ్రతను అదికారులు అంచనా వేయలేరని.. జల్ జంగిల్ జమీన్ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్దం అని తెలిపారు తుడుందెబ్బ అద్యక్షుడు గెడం గణేష్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..