
ఎండలు దంచికొడుతున్న వేళ మద్యం ప్రియులు బీర్ల కోసం ఎగబడుతున్నారు. సుర్రుమంటున్న ఎండల నుండి సేద తీరేందుకు చల్లచల్లని బీర్లను లాగించేస్తున్నారు. ఓ వైన్స్ లో మాత్రం ఓ చిల్డ్ బీర్ మద్యం ప్రియుడికి షాక్ ఇచ్చింది. స్నేహితులతో కలిసి చిల్డ్ బీర్ తాగి సేదతీరుదామనుకున్నాడు ఓ యువకుడు.. తీసుకున్న బీరు బాటిల్‌లో పేరుకుపోయిన చెత్తను చూసి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. ఓపెన్ చేసి తాగుదామని అనుకునేలోపే ఊహించని సీన్ బీర్ బాటిల్ లో దర్శనమివ్వడంతో షాక్ అవడం యువకుడి వంతు అయింది.
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని ఓ వైన్ షాపులో కొనుగోలు చేసిన ఓ బీరు బాటిల్‌లో చెత్త, చెదారం రావడంతో ఓ వినియోగదారుడు షాక్ అయ్యాడు. స్నేహితులతో కలిసి చిల్ అవుదామని బీర్లు కొనుగోలు చేసి తాగేందుకు సిద్దమవగా ఆ బీర్ బాటిల్‌లో ఏదో కదులుతున్నట్టు కనిపించింది. పరీక్షించి చూడగా.. చెత్తా చెదారం.. చిన్న చిన్న తోక పురుగులు ఆ బీర్ బాటిల్‌లో దర్శనమిచ్చాయి. వైన్స్ నిర్వహకులను నిలదీయగా మేం ఏమి చేయలేమని ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చని సలహా ఇచ్చారు. వెంటనే స్థానిక ఎక్సైజ్ సీఐ నజీర్ ను ఫోన్ ద్వారా సంప్రదించిన బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ నజీర్ ఫోన్ లోనే వివరణ ఇచ్చాడు. ఈ ఘటన తెలిసిన స్థానిక బీరు ప్రియులు.. బీర్లు తాగుదామంటేనే భయానికి గురవుతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..