
జగిత్యాల జిల్లాకు నియమితులైన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్, బూరుగుపల్లి గ్రామాల్లో ఆమె పర్యటించారు. పొలాల్లోకి నేరుగా వెళ్లిన హరిణి, వ్యవసాయ కూలీలతో మమేకమయ్యారు. వరి పొలంలోకి దిగిన ఆమె.. రైతులు మహిళా కూలీలతో కలిసి వరి నాట్లు వేసి, వారి జీవన విధానం, కష్టసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. నాటు వేసే విధానాన్ని అడిగి తెలుసుకున్న ట్రైనీ డిప్యూటీ కలెక్టర్, స్వయంగా బురదలోకి దిగి కొంతసేపు నాట్లు వేశారు. వ్యవసాయ పనులు చేస్తున్న కూలీలతో కలిసి పనిచేసిన అనంతరం, లంచ్ సమయంలో వారికి పండ్లను పంపిణీ చేశారు. అలాగే మహిళా రైతులతో కలిసి సెల్ఫీలు దిగుతూ, సుమారు అరగంట పాటు వారి మధ్య గడిపారు.
గ్రామీణ మహిళలతో కలిసి పనిచేయడం, వారి జీవన పరిస్థితులను తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని హరిణి తెలిపారు. అధికారిగా మాత్రమే కాకుండా, గ్రామీణ ప్రజలతో కలిసిపోయిన ఆమె క్షేత్ర స్థాయి పర్యటన స్థానికుల్లో విశేష స్పందనను పొందింది. నేరుగా అధికారి పొలాల్లోకి వచ్చి తమతో కలిసి పనిచేయడం చూసి మహిళా రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.