Telangana Politics: ఖమ్మంలో రాజకీయ వే‘ఢీ’.. స‌భా వేదిక నుంచే ఎన్నికల స‌మ‌ర శంఖం పూరించ‌నున్న రాహుల్..

|

Jul 01, 2023 | 8:46 AM

Telangana Politics: ఖమ్మం సభను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కనీవినీ ఎరగని రీతిలో బహిరంగ సభను నిర్వహించాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని టీపీసీసీ నిర్ణయించింది. ఇదిలా ఉండగా తమ మీటింగ్‌కు సర్కారు ఆటంకాలు కల్పిస్తోందని హస్తం పార్టీ లీడర్లు ఆరోపిస్తుండగా.. బీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టిన శకుని పాత్రలు వెళ్లిపోవడం మంచిదే అయిందని విమర్శించారు మంత్రి హరీష్‌రావు.

Telangana Politics: ఖమ్మంలో రాజకీయ వే‘ఢీ’.. స‌భా వేదిక నుంచే ఎన్నికల స‌మ‌ర శంఖం పూరించ‌నున్న రాహుల్..
Telangana Congress Party
Follow us on

T-Congress, Khammam Meeting: ఖమ్మంలో ఆదివారం జరిగే తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అయన అనుచరగణం చేరిక, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు రెండిటికి కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్న సభ కావడంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గతంలో ఎన్నడూ ఎవరూ నిర్వహించనంత భారీగా ఈ సభను నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఖ‌మ్మం స‌భా వేదిక నుంచే రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నిక‌ల కోసం స‌మ‌ర శంఖం పూరించ‌నున్నారనే ప్రచారం సాగుతోంది. అందుకే సభకు జనసమీకరణ, ఇతర ఏర్పాట్లపై ఖమ్మంలో సన్నాహక సమావేశం నిర్వహించింది. అయితే ఖమ్మం కాంగ్రెస్ సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.

ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి రెండు కళ్ళు .. తమ మూడో కన్ను శ్రీనివాస రెడ్డి అని రేవంత్ అన్నారు. శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో అందరికీ తెలుసని, అలానే శ్రీనివాస్‌రెడ్డి తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీనీ పాతాళానికి తొక్కుతారన్నారు. సభ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌టీసీ బస్సులను ఇచ్చినా ఇవ్వకున్నా సొంత వాహనాల్లో సభకు రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆనాడు పొంగులేటిని ఆర్థిక ఉగ్రవాదిగా పోల్చిన భట్టి విక్రమార్కకు నేడు ఎలా ముద్దయ్యాడని ప్రశ్నించారాయన. శకుని పాత్ర పోషించిన వాళ్లంతా వెళ్లిపోవడం మంచిదే అయ్యిందన్నారు. ఖమ్మంలో గత ఎన్నికల్లో ఒకటి గెలిచి తొమ్మిది ఓడిపోయాం..ఇప్పుడు 9 గెలిచి, ఒకటి ఓడిపోతామని జోస్యం చెప్పారు హరీష్‌రావు.

కాగా, ఖ‌మ్మం సభా వేదిక నుంచి ఎన్నికల హామీలను రాహుల్‌ గాంధీ ప్రస్తావిస్తారని తెలుస్తోంది. అందుకే సభకు జన సమీకరణపై నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని కాంగ్రెస్ కార్యాలయంలో నాయకులు భేటీ అయ్యి, సభ ఏర్పాట్లపై చర్చించారు. మొత్తంగా షెడ్యూల్‌కి ముందే ఎన్నిక‌ల‌కు రెఢీ అవుతోంది కాంగ్రెస్‌. ఖ‌మ్మం స‌భ ద్వారా ఎన్నిక‌ల కౌంట్ డౌన్ మొద‌లు పెట్టనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..