టమాట ధర పడిపోయింది. కిలో ధర కేవలం రెండు రూపాయలే పలికింది. పంట పండించిన రైతుకు ఖర్చులు పోనూ మిగిలింది సున్నా. దీంతో టమాట రైతు కంట కన్నీళ్లు… రైతు ఇంట కష్టాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో టమాట రేటు దారుణంగా పడిపోయింది. ఇన్నాళ్లు కనీసం పది రూపాయలు పలికిన టమాట ధర జనవరి 17న కేవలం రూ.2 పలికింది. దీంతో టమాట పండించే రైతులు దారుణంగా నష్టపోతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కాదు కదా నామమాత్రపు ధర కూడా దక్కడంలేదు.
ఉద్యానశాఖ లెక్క ప్రకారం క్వింటా టమాటకు రూ.900 దక్కితే రైతుకు గిట్టుబాటవుతుంది. కాగా.. ఇటీవల క్వింటాల్ ధర రూ.100 నుంచి రూ.250 మాత్రమే పలికింది. అయితే వినియోగదారులకు మాత్రం టోకు, చిల్లర వ్యాపారులు కలిసి కిలో టమాటను రూ.10 నుంచి రూ.15కు అమ్ముతుండటం గమనార్హం. కాగా గతంలో కిలో టమాట ధర రూ.40 నుంచి రూ.60 వరకు పలికింది. అప్పడూ రైతుకు దక్కింది క్వింటాకు రూ.400 నుంచి రూ.600లోపే.
క్వింటా టమాట పంట పండించడానికి రైతు సగటున రూ.600 దాకా పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని ఉద్యానశాఖ అధ్యయనంలో తేలింది. పంట కోత, రవాణా, ఇతర ఖర్చులు మరో రూ.300 వరకూ అవుతాయి. ఈ క్రమంలో క్వింటాకు కనీసం రూ.900 చెల్లిస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుందని అధికారులు తెలుపుతున్నారు. పంట దిగుబడి పెరగడంతో ధరలు పడిపోతున్నాయని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు తెలుపుతుండగా… కనీస ధర లేకపోతే పంట పండించడం ఎందుకని అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు.