Telangana: ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. అందులో ఒకరు నవవధువు.. చివరికి ఇలా ఒకటై..

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర ప్రమాదం జరిగింది. మృత్యు శకటంలా దూసుకొచ్చిన కంకరలోడ్‌తో కూడిన లారీ బస్సును ఢీకొనడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. లారీలోని కంకర ప్రయాణికులపై పడడంతో పలువురు ప్రయాణికులు ఊరిరాడక చనిపోయారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana: ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. అందులో ఒకరు నవవధువు.. చివరికి ఇలా ఒకటై..
Chevalla Bus Accident

Updated on: Nov 03, 2025 | 12:24 PM

చేవెళ్ల బస్సుప్రమాదం తాండూరులోని వడ్డెరగల్లిలో పెను విషాదాన్ని నింపింది. అక్క పెళ్లికి వచ్చిన ముగ్గురు చెల్లెళ్లు అనంతలోకాలు వెళ్లారు. హైదరాబాద్‌లో చదవుతున్న ముగ్గురు కూతుళ్లను ఉదయం ట్రైన్‌ ఎక్కించేందుకు తీసుకెళ్లాడు తండ్రి ఎల్లయ్యగౌడ్‌. కానీ ఆ ట్రైన్‌ మిస్‌ అయింది. దీంతో వారిని తాండూరు బస్టాండ్‌కు తీసుకెళ్లి బస్సు ఎక్కించాడు తండ్రి. తన కూతుళ్లను ఎక్కించింది బస్సు కాదు మృత్యుశకటం అన్న విషయం తెలుసుకుని ఆ తండ్రి గుండెపగిలేలా విలపిస్తున్నాడు. నెలాఖరులో మళ్లీ వస్తారనుకున్న కూతుళ్లు తిరిగిరాని లోకాలకు వెళ్లారని తెలిసి ఆ తల్లి కన్నీరుమున్నీరవుతోంది.

చేవెళ్ల ప్రమాదం 21 మందిని బలితీసుకుంది. అందులో తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్- అంబికల ముగ్గురు కుమార్తెలు మృతిచెందడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న ఎల్లయ్యగౌడ్‌కు నలుగురు కూతుళ్లు ఉన్నారు. అక్టోబర్ 17న తన పెద్దకూతురు అనూషకు పెళ్లి చేశాడు. అక్క పెళ్లి కోసం ఎంతో ఆనందంగా హైదరాబాద్‌ నుంచి వచ్చారు ముగ్గురు చెల్లెళ్లు. ఎల్లయ్యగౌడ్‌ రెండో కూతురు తనూష ఎంబీఏ చదువుతుంది . మూడో కుమార్తె సాయిప్రియ హైదరాబాద్‌ కోటి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. నాలుగో కుమార్తె నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ముగ్గురూ సరస్వతీ పుత్రికలే.. చదువుల తల్లులు. అందరినీ అల్లారుముద్దుగా పెంచారు తల్లిదండ్రులు. అందరికీ ఉన్నత చదువులు చదివిస్తున్నారు ఎల్లయ్యగౌడ్‌.

ఇవాళ ముగ్గురిని హైదరాబాద్‌కు తిరిగి పంపేందుకు రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లాడు ఎల్లయ్యగౌడ్‌. కానీ వాళ్లను దురదృష్టం వెంటాడింది. ట్రైన్ మిస్ అయిపోయింది. దీంతో ముగ్గురు కూతుళ్లను తాండూరు ఆర్టీసీ బస్టాండ్‌కు తీసుకెళ్లి హైదరాబాద్ బస్సు ఎక్కించి సెండాఫ్ ఇచ్చాడు తండ్రి. అదే ఆఖరి సెండాఫ్‌ అవుతుందని ఆ తండ్రి ఊహించలేదు. బస్సు బయల్దేరిన కాసేపటికే తన కూతుళ్లు బస్సు ప్రమాదంలో చనిపోయారని ఫోన్ రావడంతో ఆ తల్లిదండ్రులు విలవిలలాడిపోయారు. కాలేజీలకు వెళ్తున్నామని చెప్పిన కూతుళ్లు కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లి గుండెలు అవిసేలా విలపిస్తోంది. ఆ తల్లి రోదన చూసి అక్కడున్నవారంతా కన్నీరు పెట్టుకున్నారు.