
మహబూబాబాద్‌లో నిన్న జరిగిన ఘోర ప్రమాదంలో గ్రానైట్ రాళ్ళకింద పడి ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇప్పుడే మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందడంతో.. మృతుల సంఖ్య మూడుకి చేరింది. కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగిడుతూ జనం సంబరాల్లో మునిగితేలుతోన్న వేళ….మహబూబాబాద్ జిల్లా మంగోలిగూడెంని మాత్రం అంతులేని విషాదంలోకి నెట్టింది. గ్రైనైట్‌లోడ్‌తో వెళుతోన్న లారీ లోనుంచి భారీ బండరాళ్ళు జారి ఆటోపై పడడంతో ఆటోలో ప్రయాణిస్తోన్న బానోత్ సుమన్, శ్రీకాంత్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. భారీ బండరాళ్ళకింద పడడంతో మృతుల దేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. ఓ వైపు ఛిద్రమైన మృతదేహాల ఆనవాళ్ళు.. మరో వైపు భీభత్సంగా మారిన ఘటనాస్థలం అక్కడి పరిస్థితిని చెప్పకనే చెపుతోంది. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ఘటనా స్థలం హృదయవిదారకంగా మారింది.
నూతన సంవత్సరం కూలీల కుటుంబాలను ఛిద్రం చేసింది. ఆటోలో వెళుతోన్న కూలీలకు గ్రానైట్‌తో వస్తోన్న లారీ మృత్యుశకటంలా మారి, నిన్న ఇద్దరి ప్రాణాలను హరించింది. ఈ రోజు మరోవ్యక్తి మృతిచెందాడు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. డెడ్ బాడీస్ మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
టీ.ఎస్02 యూఏ నెంబర్ గల గ్రానైట్ లారీ ఖమ్మం వైపు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.
అయితే ఈ విషాదం అతిక్రమణల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు నీళ్ళొదిలి అక్రమంగా రవాణా చేస్తోన్న గ్రానైట్‌తో ఈ దారుణం జరిగినట్టు తెలుస్తోంది. పరిమితులకు మించి గ్రానైట్ బరువుండడం ఒకటైతే, జీరో వ్యాపారం దందా ఈ దారుణాలకు కారణంగా తెలుస్తోంది. పర్మిట్‌లు లేకుండా జరుగుతోన్న వేల టన్నుల బండరాళ్ళ ఎగుమతులు కూలీల జీవితాల్లో తీరని విషాదాన్ని నింపింది.
గ్రానైట్‌ని తరలించేటప్పుడు పాటించాల్సిన కనీస నిమయాలను కూడా గ్రానైట్ వ్యాపారులు పాటించకపోవడం ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. నిజానికి 40 టన్నులకు మించి గ్రానైట్ రవాణా చేయకూడదు. కానీ 8 వేల క్యూబిక్ మీటర్ల బండ రాళ్ళను అక్రమంగా రవాణా చేస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇక గ్రానైట్ వ్యాపారులు ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టి సున్నం పెడుతోన్న పరిస్థితి గ్రానైట్ దందాని తెరపైకి తెస్తోంది. ప్రతినెలా 3 కోట్ల వరకు పన్నులు ఎగవేస్తున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం