Hyderabad: నకిలీ జీవోలతో ఏకంగా ప్రభుత్వ భూమినే అమ్మకానికి పెట్టి బుక్కయ్యారు

హైదరాబాద్‌ శివారులో భారీ భూకుంభకోణం వెలుగుచూసింది. గండిపేటలోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ జీవోలతో రెగ్యులరైజ్ చేసినట్లు చూపించి కోట్ల రూపాయలకు విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురిని నార్సింగి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వాట్సాప్‌, సోషల్‌మీడియాలో నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు వైరల్‌ కావడంతో తహసీల్దార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Hyderabad: నకిలీ జీవోలతో ఏకంగా ప్రభుత్వ భూమినే అమ్మకానికి పెట్టి బుక్కయ్యారు
Gandipet Land

Edited By:

Updated on: May 29, 2026 | 9:01 PM

హైదరాబాద్‌ శివారులో మరో భారీ భూకుంభకోణం వెలుగుచూసింది. ప్రభుత్వ భూమిని నకిలీ జీవోలతో రెగ్యురైజ్ చేసినట్లు చూపించి కోట్ల రూపాయలకు విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురిని నార్సింగి పోలీసులు అరెస్ట్‌ చేశారు. గండిపేట సర్వే నంబర్‌ 18లోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా అమ్మేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు. గండిపేట మండల తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి ఈ నెల 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తుల పేర్లపై క్రమబద్ధీకరించినట్లు చూపిస్తూ ఐదు నకిలీ ప్రభుత్వ జీవోలు వాట్సాప్‌, సోషల్‌మీడియా వేదికల్లో చక్కర్లు కొడుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా గండిపేటకు చెందిన నిమ్మల వేణుగోపాల్‌, నిమ్మల రామస్వామి, నిమ్మల రాజేష్‌ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు పాస్‌బుక్స్‌, మెమొరాండం ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌ పత్రాలు, మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ప్రభుత్వ భూమిపై హక్కులు సాధించేందుకు నిందితులు గతంలో హైకోర్టును ఆశ్రయించినట్లు గుర్తించారు. అయితే 2025 అక్టోబర్‌లోనే ఆ పిటిషన్లు కొట్టివేసినట్లు పోలీసులు తెలిపారు. అయినప్పటికీ తమకు ఎలాంటి చట్టబద్ధ హక్కులు లేకపోయినా.. నిందితులు బొల్ల రమేష్‌, బ్రహ్మనాయుడుతో కలిసి ఎకరాకు రూ.3.5 కోట్ల చొప్పున భూమి విక్రయించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడైంది.

ఈ వ్యవహారంలో నిమ్మల కుటుంబ సభ్యులు ఎంఓయూలపై సంతకాలు చేసి దాదాపు రూ.4 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ డీల్‌కు సునీల్‌, రాధాకృష్ణ తదితరులు మధ్యవర్తిత్వం వహించినట్లు అనుమానిస్తున్నారు. కేసులో నిమ్మల రాజేష్‌ గౌడ్‌, నిమ్మల వేణుగోపాల్‌, నిమ్మల సాయికిరణ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి.. 

Follow Us