నవంబర్ నెలలో సహజంగా మగ ఆడ పులులు జతకట్టే సమయం అంటున్నారు ఫారెస్ట్ అధికారులు. అందులో భాగంగా పులులు సాధారణం కంటే తమ జోడు కోసం అడవిలో ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంటాయి. అందులో భాగంగా కొన్ని సందర్భాల్లో అడవిని దాటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా సంచరిస్తూ ఉంటాయని చెబుతున్నారు. ఈ టైంలో పులులు సహజంగా కొంత ఉద్రేకంతో ఫెరోషియస్ గా ఉంటాయి. తమ తోడును వెతుక్కునే క్రమంలో పులులు చాలా యాక్టివ్ గా తిరుగుతూ ఉంటాయి. అందువల్లనే నవంబర్ డిసెంబర్ మాసంలో పులి దాడులు పెరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
అయితే, పులి సంచారం ఉన్న ప్రాంతవాసులు ఒంటరిగా బయటకు వెళ్లకపోవటం మంచిదని చెబుతున్నారు. ఇక సాయంత్రం 6 నుంచి తెల్లావారి ఉదయం 10 గంటల వరకు అడవుల్లో వన్య మృగాలు సంచరించేందుకు అనువైన సమయం అంటున్నారు. ఈ టైమ్‌లో వాటికి ఇబ్బంది కలగకుండా స్థానిక ప్రజలు, రైతులు, పశువుల మేత కూడా అడవిలోకి వెళ్లకుండా ఉండటం లాంటివి చేస్తే పులి దాడుల నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు.
అయితే, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని ఈజ్గాంలో పులి దాడి ఘటనలో మరణించిన గన్నారం మండల వాసి కళ్యాణి కుటుంబానికి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూ. 10 లక్షల పరిహారం.. ప్రక్రియను పూర్తి చేసినట్లు అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండా సురేఖ ప్రకటించారు. పత్తి సేకరణకు వెళ్లిన కళ్యాణి పులి దాడిలో మరణించడం తనను ఎంతో వేదనకు గురి చేసిందని పేర్కొన్నారు. శాఖాపరంగా అటవీ శాఖ అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ ఈ దుర్ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. నష్టపరిహారంతో పాటు వారి కుటుంబ అవసరాల మేరకు తగిన విధంగా సహాయ, సహకారాలను అందిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.
ఇవాళ సిర్పూర్ (టి) మండలంలోని దుబ్బగూడెంలో సురేష్ అనే రైతు పై మరో దాడి ఘటన జరగడంతో మంత్రి సురేఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా డిఎఫ్ఓ నీరజ్ ను రైతు పరిస్థితి పై ఆరా తీశారు. ప్రాథమిక చికిత్స అనంతరం రైతు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల జిల్లా హాస్పిటల్ కు సురేష్ ను తరలిస్తున్నట్టు డిఎఫ్ఓ మంత్రికి వివరించారు. ప్రస్తుతం పులి కదలికల పై సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర వైపు పులి కదలికలను గుర్తించినట్టుగా డిఎఫ్ఓ మంత్రికి తెలిపారు. ఇప్పటికే పలుచోట్ల పశువులపై కూడా పులి దాడి ఘటనలు నమోదైన నేపథ్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పిసిసిఎఫ్ ను ఆదేశించారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు, పశువులను మేతకు తీసుకొని పోయేవారు జాగ్రత్తగా ఉండాలనీ, అటవీ శాఖ సూచనలను పాటించాలని మంత్రి సురేఖ ప్రజలకు పిలుపునిచ్చారు.
పులి సంచారానికి సంబంధించిన జాడలు కనిపించడం, పులిని చూసినట్లుగా ఎవరైనా సమాచారం అందించిన పక్షంలో సమీప ప్రాంతాల ప్రజలను వెంటనే అప్రమత్తం చేయాలని అటవీ అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన కార్యాచరణను అమలు చేయాలని అటవీ అధికారులను నిర్దేశించారు. రాకపోకల సందర్భంగా పులి నుంచి ప్రమాదం పొంచి ఉందని భావించిన పరిస్థితుల్లో పులి దాడి నుంచి బయటపడడానికి ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి సురేఖ అటవీ అధికారులకు స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..