Telangana: వివాదాస్పదంగా మారిన నల్గొండ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది తీరు.. వెలుగులోకి మరో దారుణం

| Edited By: Balaraju Goud

Aug 25, 2024 | 3:59 PM

ఎన్ని విమర్శలు వస్తున్నా.. సరే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది తీరు మాత్రం మారడం లేదు. కుర్చీలోనే మహిళ ప్రసవించిన దారుణ ఘటన జరిగిన రెండు రోజులకే నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మరో దారుణం వెలుగు చూసింది.

Telangana: వివాదాస్పదంగా మారిన నల్గొండ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది తీరు.. వెలుగులోకి మరో దారుణం
Nalgonda Ggh
Follow us on

ఎన్ని విమర్శలు వస్తున్నా.. సరే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది తీరు మాత్రం మారడం లేదు. కుర్చీలోనే మహిళ ప్రసవించిన దారుణ ఘటన జరిగిన రెండు రోజులకే నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మరో దారుణం వెలుగు చూసింది. డెలివరీ కోసం వచ్చిన గర్భిణీకి వైద్యురాలు, వైద్య సిబ్బంది బలవంతంగా నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడంతో శిశువు మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు.

రెండు రోజుల క్రితం నల్లగొండ ప్రభుత్వ జిల్లా జనరల్ ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో కుర్చీలోనే మహిళ ప్రసవించింది. ఈ ఘటనపై విచారణ జరిపిన అదనపు జిల్లా కలెక్టర్ పూర్ణచంద్ర.. ఇందుకు బాధ్యులైన డ్యూటీ డాక్టర్‌ నిఖితతో పాటు స్టాఫ్‌ నర్సులు ప్రమీల, ఉమ, పద్మ, సుజాతలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. నిరసనగా శనివారం(ఆగస్ట్ 24) మధ్యాహ్నం నుండి ఆసుపత్రి డాక్టర్లు, నర్సులు డ్యూటీలు వదిలి సమ్మె చేస్తూ ఆందోళన చేపట్టారు.

ఇదే సమయంలో నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం, గారగుంట్ల పాలెంకు చెందిన శ్రీలత తీవ్రమైన పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చింది. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది సమ్మె చేస్తున్నారనే విషయం తెలుసుకుని.. డెలివరీ కోసం శ్రీలత ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లే ప్రయత్నం చేసింది. తామే డెలివరీ చేస్తామంటూ వైద్యురాలు, వైద్య సిబ్బంది శ్రీలతను ఆసుపత్రిలోకి తీసుకువెళ్లారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆపరేషన్ చేసే సమయానికి శిశువు మృతి చెందింది.

అయితే, డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ బాబు చనిపోయారంటూ తల్లిదండ్రులు రాజు, శ్రీలత ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. వైద్యురాలు కోపంతో ఆపరేషన్ చేశారని, తాము భయపడినట్టే ఆపరేషన్ చేసి శిశువును చంపారని బాధితులు ఆరోపిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వరుసగా జరుగుతున్న ఘటనలపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..