Telangana: ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ నమూనా విడుదల

|

Oct 06, 2024 | 7:33 PM

అందరూ ఆశ్చర్యపోయేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూల్స్ ఉండబోతున్నాయన్నారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా 20 చోట్ల స్కూల్స్‌ నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలిపారు.

Telangana: ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ నమూనా విడుదల
Integrated Residential School
Follow us on

ప్రపంచంతో పోటీ పడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తయారు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ స్కూల్స్‌కు సంబంధించిన నమూనాలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. ఒక్కో స్కూల్స్ 20 నుంచి 25 ఎకరాల్లో నిర్మిస్తామని భట్టి విక్రమార్క వివరించారు. ఈ స్కూల్స్‌లో ఇంటర్నేషనల్ స్టాండర్ట్స్‌తో ఇంగ్లీష్ మీడియం 12వ తరగతి వరకు బోధన అందిస్తామని తెలిపారు.

పలు నియోజకవర్గాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద నిర్మాణం

ప్రస్తుతం 20 నుంచి 22 వరకు స్థలాలు సేకరించి ఆయా నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నామన్నారు. కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్లగొండ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో ఈ స్కూల్స్‌ను నిర్మిస్తారు. వీటితోపాటు మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, ఆందోల్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట, స్టేషన్ ఘన్‌పూర్, తిరుమలగిరి, తుంగతుర్తిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించనున్నారు. దసరా పండుగ కంటే ముందే భూమి పూజ చేసి నిర్మాణాలు చేపడతామన్నారు. గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1023 రెసిడెన్షియల్ స్కూల్స్

ప్రస్తుతం రాష్ట్రంలో 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయని, 663 స్కూళ్లకు సొంత భవనాలు లేవన్నారు భట్టి విక్రమార్క. బీసీలకు 367 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 306 అద్దె భవనాలు అని వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఈ ఏడాది రూ.5 వేల కోట్లు నిధులు ఖర్చు చేస్తామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి. విజయదశమి ముందు రోజు ఈ నెల 11 వ తేదీన ఆ స్కూళ్లకు భూమి పూజ చేస్తామని తెలిపారు. వీలైనంత త్వరగా ప్రతీ నియోజకవర్గంలో ఒక రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.