
తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు వాతావరణం మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం గురువారం ఉదయం నాటికి మరింత బలపడి సుస్పష్టమైన అల్పపీడనంగా మారిందని వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండగా, రానున్న రెండు రోజుల్లో ఇది వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో తెలంగాణలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయని అధికారులు తెలిపారు. జూలై 16న రాష్ట్రంలోని అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. జూలై 17, 18 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశమూ ఉందని వివరించారు. వాతావరణ శాఖ మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ కొనసాగించింది.
జూలై 16న రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత, వేడి వాతావరణ పరిస్థితులు కొనసాగవచ్చని హెచ్చరించింది. అలాగే ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, మిగిలిన జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
జూలై 17న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అదే సమయంలో బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
జూలై 18న కూడా ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో, ఇతర ప్రాంతాల్లో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు, మత్స్యకారులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు తాజా వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్న సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి