Telangana Weather Report: రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న 5 రోజులు తెలంగాణ రాష్ట్రం అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట్, కామారెడ్డి జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇవాళ, రేపు రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ నుంచి మోస్తరు వర్షాలు చాలా జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. రానున్న 48 గంటల్లో ఉత్తర, దక్షిణ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇదిలాఉంటే.. మహబూబ్‌నగర్ జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా కోడూరు వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు చిక్కుకుపోయింది. డ్రైవర్ అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సహాయంతో బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. గురువారం రాత్రి కురిసిన వానతో కోడూరు-మాచన్‌పల్లి మధ్య ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జిలోకి భారీగా వరద నీరు చేరింది. అది తెలియని ఓ ప్రైవేటు స్కూల్ బస్సు అటుగా వెళ్లింది. అండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన వరద నీటిలో బస్సు చిక్కుకుపోయింది. ఆ సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ట్రాక్టర్ సహాయంతో స్కూలు బస్సును బయటకు తీశారు. చిన్నారులంతా క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
‘కిన్నెరసాని’ పోటెత్తిన వరద..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని జలాశయానికి వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 72 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 404 అడుగులకు చేరింది. ఆరు గేట్లను ఎత్తి 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇదిలాఉంటే.. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.