Traffic Challan : ట్రాఫిక్ చలాన్లపై బిగ్ అప్‌డేట్.. వాహనదారులకు నెల రోజులే గడువు!
ట్రాఫిక్ చలాన్ల విషయంలో రాష్ట్రంలోని వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ట్రాఫిక్ చలాన్‌ల సమాచారం వాహన యజమానులకు చేరే ప్రక్రియను వేగవంతం చేసేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్టు రవాణా శాఖ పేర్కొంది. కాబట్టి రాష్ట్రంలోని ప్రతి వాహన యజమాని తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని కోరింది.

రాష్ట్రంలోని వాహనదారులకు తెలంగాణ సర్కార్ కీలక సూచనలు చేసింది. ట్రాఫిక్ చలాన్ల విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానున్న రాష్ట్ర రవాణా శాఖ తెలిపింది.ట్రాఫిక్ చలాన్‌ల సమాచారం ప్రతి వాహన యజమానికి చేరేందుకు ఈ మార్పులు తీసుకొచ్చినట్టు తెలిపింది. ఈ ట్రాఫిక్ చలాన్‌ల సమాచారం నేరుగా మీకు మొబైల్‌కు రావాలంటే.. వాహనదారులు తప్పకుండా తమ వ్యక్తిగత వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని రవాణా శాఖ స్పష్టం చేసింది.
ఏం చేయాలి? ఎక్కడ చేయాలి?
రవాణా శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. వాహనదారులు వాళ్ల ప్రస్తుత మొబైల్ నంబర్, వాట్సాప్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వివరాలను కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ అయిన vahan.parivahan.gov.in పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వం నెల రోజుల గడువు కూడా ఇచ్చింది. ఈ టైంలోపు వాహన దారులు తమ వివరాలను అప్‌డేట్ చేసుకోకపోతే.. చలాన్లకు సంబంధించన సమాచారాన్ని పొందలేరని స్పష్టం చేసింది.
కొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశాలు
ఈ అప్‌డేట్ ప్రక్రియ పూర్తయితే, ట్రాఫిక్ చలాన్లు, రవాణా శాఖకు సంబంధించిన ఏ సమాచారమైనా నేరుగా మీ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్, వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా అందుతుంది. దీనివల్ల చలాన్ల ప్రక్రియలో పారదర్శకత పెరగడమే కాకుండా, పెండింగ్ బకాయిల వసూళ్లు కూడా వేగంగా జరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం విధించిన గడువు ముగిసిన తర్వాత, పోర్టల్‌లో ఉన్న నంబర్ లేదా ఈ-మెయిల్‌కు పంపిన సమాచారం వాహనదారునికి చేరినట్లుగానే అధికారులు భావిస్తారు. కాబట్టి, మాకు మెసేజ్ రాలేదు, విషయం తెలియదు అనే సాకులు చెబితే ఇకపై అధికారులు అంగీకరించరు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
