Telangana: దేశంలో అత్యంత ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉన్న రాష్ట్రం తెలంగాణే

ఒకప్పుడు పరిశ్రమ పెట్టాలంటే భూమి దొరక్క, అనుమతులు రాక కాళ్ళరిగేలా తిరిగే పారిశ్రామిక వేత్తలను చూశాం. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. "రండి.. బాబూ రండి.. భూమి సిద్ధంగా ఉంది, ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో ఇప్పుడే ఫ్యాక్టరీ మొదలుపెట్టండి" అని అన్ని రాష్ట్రాలు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుంది. దేశంలో ఎక్కడా లేని సదుపాయం తెలంగాణకే సొంతం. ఇంతకీ ఏంటది?

Telangana: దేశంలో అత్యంత ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉన్న రాష్ట్రం తెలంగాణే
Telangana Land Area

Updated on: Jan 01, 2026 | 10:21 PM

ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం.. పరిశ్రమల కోసం సిద్ధంగా ఉన్న భూమి విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. తెలంగాణలో 30 వేల 749 హెక్టార్ల భూమి, అంటే 76 వేల ఎకరాల భూమి తక్షణమే పరిశ్రమలకు కేటాయించడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో ఉన్న 157 పారిశ్రామిక పార్కుల్లో ఈ భూమి “రెడీ”గా ఉంది. ఆ తర్వాత మహారాష్ట్రలో 19 వేల 658 హెక్టార్లు.. తమిళనాడులో 16 వేల 291 హెక్టార్లు.. గుజరాత్‌లో 12 వేల 605 హెక్టార్ల భూమి ఉంది. గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను కూడా తెలంగాణ వెనక్కి నెట్టింది. ఒక ఇన్వెస్టర్‌కు కావాల్సింది ఇదే. పరిశ్రమకు అనుమతి రాగానే భూమి చేతికి రావాలి. ఆ భరోసా ఇప్పుడు తెలంగాణ ఇస్తోంది.

తమిళనాడులో భూమి లభ్యత పెద్ద సవాలు

ఆటోమొబైల్, మాన్యుఫ్యాక్చరింగ్‌లో తమిళనాడు ఎప్పటినుంచో రారాజు. కానీ, అక్కడ ఇప్పుడు భూమి లభ్యత ఒక పెద్ద సవాలు. అంతో ఇంతో భూమి అందుబాటులో ఉన్నా.. ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నంత విస్తారమైన ల్యాండ్ బ్యాంక్ తమిళనాడులో దొరకడం కష్టమవుతోంది. టెక్నాలజీకి కేరాఫ్ అయిన బెంగళూరులోనూ ఇదే పరిస్థితి. పైగా.. ట్రాఫిక్‌తో పాటు పలు సమస్యలు బెంగళూరులో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు జంకుతున్నారు. కొత్తగా భూసేకరణ కూడా రాజకీయంగా, సామాజికంగా పెద్ద సమస్యగా మారుతోంది.

ఏపీలో లక్షా పది వేల హెక్టార్ల భూమి

ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ నివేదిక ప్రకారం ఏపీలో లక్షా పది వేల హెక్టార్ల భూమి ఉన్నప్పటికీ.. అందులో పరిశ్రమలకు తక్షణమే అందుబాటులో ఉన్నది కేవలం పదివేల ఎకరాలు మాత్రమే. రాజధాని నిర్మాణం, పోర్టు ఆధారిత పరిశ్రమలపై అక్కడ ఫోకస్ ఉన్నా.. “ప్లగ్ అండ్ ప్లే” ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో హైదరాబాద్ చుట్టూ ఉన్న ఎకో-సిస్టమ్ తెలంగాణకు పెద్ద ప్లస్ పాయింట్. తెలంగాణకి ఉన్న మరో అడ్వాంటేజ్.. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు దాని వెలుపల వస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు. ఈ 150 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ దానిపై నిర్మించబోతున్న 300 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్ ఆ మధ్యలో ఉన్న స్థలం ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటుకు బెస్ట్ ఆప్షన్.

విజన్ 2047‌తో తెలంగాణ పయనం

కేవలం భూమి ఉంటే సరిపోతుందా? అంటే సరిపోదు. దానికి విజన్ తోడవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన “విజన్ 2047” డాక్యుమెంట్ ఈ భూములను బంగారంగా మార్చే ప్రణాళికను చూపిస్తోంది. రాబోయే కాలం అంతా పర్యావరణ హితానిదే. అందుకే “గ్రీన్ పార్కుల” అభివృద్ధికి రేవంత్ సర్కార్ పెద్దపీట వేస్తోంది. కేంద్రం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 41 పార్కులు ‘లీడర్స్’గా నిలవడం దీనికి నిదర్శనం. 2025-26 బడ్జెట్‌లో మౌలిక వసతుల కోసం ఏకంగా 2 వేల 500 కోట్లు కేటాయించడం, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తోంది. షెడ్డు కట్టి, కరెంటు, నీళ్లు ఇచ్చి.. “మీరు మిషన్లు తెచ్చుకోండి చాలు” అనే కాన్సెప్ట్ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వరం. ఒకప్పుడు “నీళ్లు లేని బీడు భూములు” అని పేరుగాంచిన నేలలే.. ఇప్పుడు పారిశ్రామిక సిరులను పండించేందుకు సిద్ధమయ్యాయి.

హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాలపై ఫోకస్

ఇన్వెస్టర్ల దృష్టంతా ఇప్పుడు హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాలపైనే ఉంది. రాజకీయాలకు అతీతంగా, గడిచిన దశాబ్ద కాలంగా జరిగిన పాలసీ నిర్ణయాలు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న “విజన్ 2047” నిర్ణయాలు.. తెలంగాణను కేవలం దక్షిణాదిలోనే కాదు, ఆసియాలోనే అత్యుత్తమ పారిశ్రామిక హబ్‌గా మార్చబోతున్నాయి.