Telangana: జిల్లాల్లోని పేద రోగులకు ఇది వరం లాంటి వార్తే.. సర్కార్ కీలక నిర్ణయం..

తెలంగాణ ప్రభుత్వం పేదలకు నాణ్యమైన వైద్య సేవలను వారి ఇంటి దగ్గరనే అందించడానికి కీలక చర్యలు తీసుకుంది. ప్రస్తుతం జిల్లాల్లో సరైన చికిత్స లభించకపోవడం, రోగులు హైదరాబాద్‌లోని పెద్ద ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండటం, ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆస్పత్రులపై ఒత్తిడి పెరగడం వంటి సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana: జిల్లాల్లోని పేద రోగులకు ఇది వరం లాంటి వార్తే.. సర్కార్ కీలక నిర్ణయం..
Patients

Edited By:

Updated on: Dec 25, 2025 | 1:09 PM

తెలంగాణలో పేదలకు నాణ్యమైన వైద్యాన్ని వారి గడప దగ్గరకే తీసుకెళ్లే దిశగా.. రేవంత్ సర్కార్ కీలక సంస్కరణలకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన చికిత్స లభించకపోయినా.. పరిస్థితి చేయి దాటినా..  రోగులు తప్పనిసరిగా హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి ఆస్పత్రులపై భారీ భారం పడటంతో పాటు, రోగులు ప్రయాణ వ్యయం, కీలక సమయంలో టైం వేస్ట్ అవ్వడం, ప్రాణాపాయం వంటి అనేక సమస్యలను ఎదుర్కొనాల్సి వచ్చేది. ఈ పరిస్థితికి పర్మనెంట్‌గా పరిష్కారం చూపాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్‌ను పూర్తిస్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య కేంద్రాలుగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాల్లోనే అత్యున్నత వైద్య సేవలు అందుబాటులోకి రావాలని ఆయన సూచించారు.

తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 36కు చేరింది. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా టీచింగ్ హాస్పిటల్ కూడా ఉంది. వీటిలో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ వంటి విభాగాలకు సంబంధించిన.. నిపుణులైన ప్రొఫెసర్లు ఉన్నప్పటికీ, అవసరమైన ఆధునిక పరికరాలు, మౌలిక సదుపాయాల కొరత కారణంగా పూర్తి స్థాయిలో సేవలు అందించలేకపోతున్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం భారీ కార్యాచరణను రూపొందించింది. జిల్లాల్లోని టీచింగ్ హాస్పిటల్స్‌కు అవసరమైన క్యాథ్ ల్యాబ్‌లు, ఎండోస్కోపీ యూనిట్లు, అత్యాధునిక డయాగ్నస్టిక్ పరికరాలు తక్షణమే సమకూర్చాలని నిర్ణయించింది. భవనాలు, పరికరాలకే పరిమితం కాకుండా వైద్య సేవల నాణ్యతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.

డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లకు అవసరమైన సాంకేతిక సహకారం అందించడంతో పాటు, స్పెషలిస్ట్ వైద్యుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు, జిల్లా ఆస్పత్రుల్లో రిఫరల్ ప్రోటోకాల్‌ను కఠినతరం చేయనున్నారు. అంటే, జిల్లా స్థాయిలో చికిత్స చేయగల కేసులను అనవసరంగా హైదరాబాద్‌కు పంపకుండా, అక్కడే మెరుగైన వైద్యం అందేలా స్పష్టమైన నిబంధనలు అమలు చేయనున్నారు. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలకు ఆర్థికంగా, మానసికంగా పెద్ద ఊరట లభించనుంది. భవిష్యత్తులో టీచింగ్ హాస్పిటల్స్ కేవలం వైద్య విద్యార్థుల శిక్షణకే కాకుండా, పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే టర్టియరీ కేర్ హబ్‌లుగా మారనున్నాయి. క్రిటికల్ కేర్ యూనిట్లు (CCUలు), మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు ద్వారా జిల్లాల్లోనే క్లిష్టమైన ఆపరేషన్స్ నిర్వహించే స్థాయికి ప్రభుత్వ ఆస్పత్రులు చేరుకోనున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..