Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బహిర్భూమికని వెళ్లి… తిరిగిరాని లోకాలకు విద్యార్థి..

వనపర్తి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. బహిర్భూమికని స్కూల్ వెనకాలకు వెళ్లి విగత జీవిగా మారిన ఘటన కన్నీరు తెప్పిస్తోంది. ఎదుగుతున్న తనయుడి మృతి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Telangana: బహిర్భూమికని వెళ్లి... తిరిగిరాని లోకాలకు విద్యార్థి..
Harish
Follow us
Boorugu Shiva Kumar

| Edited By: Ravi Kiran

Updated on: Dec 21, 2024 | 5:06 PM

వనపర్తి మండలం పెబ్బేరు రోడ్డులోని తిరుమలయగుట్ట సమీపంలో రేడియంట్ ప్రైవేటు పాఠశాలలో హరీష్ (15) అనే విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. ఉదయం బహిర్భూమికని స్కూల్ వెనకాలకు హరీష్ ఇంకో విద్యార్థి కలిసి వెళ్ళారు. అయితే ఆ పక్కనే వేరుశనగ పంటకు అడవి పందుల నుంచి రక్షణ కోసం విద్యుత్ తీగలు అమర్చి… వాటికి కరెంటు ప్రసరింప చేస్తున్నారు. ఇది గమనించని హరీశ్ ప్రమాదవశాత్తు వాటిని ముట్టుకున్నాడు. దీంతో తీగలకు ఉన్న విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు హరీశ్. సమాచారం అందుకున్న రేడియంట్ స్కూలు సిబ్బంది హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని పరిశీలించిన డాక్టర్లు హరీశ్ మృతిచెందినట్లు ధృవీకరించారు.

విద్యుత్ ఘాతానికి గురైన హరీష్ (15) స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా చిన్నంబావి మండలం పెద్దమరు గ్రామం. తండ్రి భాస్కరావుకు ఇద్దరు సంతానం ఇద్దరూ రేడియంట్ స్కూల్ లోనే చదువుతున్నారు. పెద్ద కుమారుడు, మృతుడు హరీశ్ 9వ తరగతి చదుతున్నాడు… చిన్నబాబు 7వ తరగతి అభ్యసిస్తున్నాడు. ఘటన సమాచారం తెలియగానే హరీశ్ తల్లిదండ్రులు, బంధువులు జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. మంచి విద్యాబుద్ధులు నేర్పించకుంటాడని స్కూల్‌కు పంపిన తమ తనయుడు.. అలా విగత జీవిగా పడి ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆసుపత్రి వద్ద మృతుని తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. ఆ దృశ్యాలు అందరినీ కలచివేశాయి.

ఇక విద్యార్థి మరణవార్త తెలుసుకుని పలు విద్యార్థి సంఘాలు బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపాయి. మృతుని కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..