కరోనావైర‌స్ ఇంకా యాక్టివ్‌గానే ఉంది.. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సూచిన సీఎస్ సోమేశ్ ‌కుమార్

|

Mar 30, 2021 | 9:58 PM

క‌రోనా ఇంకా ఏమాత్రం త‌గ్గలేదు.. దేశంలోని ఏ రాష్ట్రం కూడా కోవిడ్‌-19పై విజ‌యం సాధించ‌లేదు.. క‌రోనావైర‌స్ ఇంకా యాక్టివ్‌గానే ఉంది..

కరోనావైర‌స్ ఇంకా యాక్టివ్‌గానే ఉంది.. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సూచిన సీఎస్ సోమేశ్ ‌కుమార్
Telangana State Chief Secretary Somesh Kumar
Follow us on

Collectors Video Conference:  క‌రోనా ఇంకా ఏమాత్రం త‌గ్గలేదు.. దేశంలోని ఏ రాష్ట్రం కూడా కోవిడ్‌-19పై విజ‌యం సాధించ‌లేదు.. క‌రోనావైర‌స్ ఇంకా యాక్టివ్‌గానే ఉంది.. మ‌న‌ల్ని దెబ్బతీస్తూనే ఉంది.. క‌రోనాపై పోరులో గెలిచామ‌ని భావించిన ప్రతిసారి అది ఎదురుదెబ్బ తీస్తూనే ఉంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలో కొవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చూడాలని.. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించడం పూర్తి స్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్పెరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. నిత్యం కొత్తగా కోవిడ్ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.

అలాగే, పల్లె ప్రగతి, ఉపాధి హామీ పథకం, హరితహారం, సమీకృత మార్కెట్ల నిర్మాణం, ధరణి, కరోనా, ధాన్యం సేకరణ సంబంధిత అంశాలపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్షించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ప్రతి మండలానికి చెందిన ప్రత్యేకాధికారులు నర్సరీలను సందర్శించి మొక్కలు బతికేలా చూడాలని చెప్పారు. హరిత తెలంగాణ లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని సూచించారు.

సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం కోసం అనువైన స్థలాలను కలెక్టర్లు వ్యక్తిగతంగా పరిశీలించి ఎంపిక చేయాలని సీఎస్ ఆదేశించారు. రాబోయే ఆరు నెలల్లో వాటి నిర్మాణం పూర్తయ్యేలా చూడాలన్నారు. ధరణి పోర్టల్ విషయంలో అద్భుతంగా కృషి చేశారని కలెక్టర్లను అభినందించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. గ్రామాల్లో తగిన సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని.. ఏ ఒక్క రైతూ అసౌకర్యానికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని సీఎస్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.

ఇదిలావుంటే, దేశంలో కొద్ది రోజుల్లోనే క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగాయ‌ని.. ఇప్పుడు భార‌త్ సెకండ్ వేవ్ గుప్పిట్లో ఉంద‌ని నీతి ఆయోగ్ స‌భ్యుడు వీకే పాల్ తెలిపారు. రానున్న రోజుల్లో ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారే అవ‌కాశం ఉంద‌ని హెచ్చరించారు. ప్రజ‌లంతా కోవిడ్ 19 నిబంధ‌న‌ల‌ను త‌ప్పనిస‌రిగా పాటించాల‌ని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమ‌త్తమై త‌క్షణ చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.

మరోవైపు, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో ముఖానికి మాస్క్‌ ధరించకుండా రోడ్లపై, వాహనాల్లో తిరిగే వారిని ఫోటోలు తీసి జరిమానా విధించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మంగళవారం నుంచి ట్రాఫిక్ పోలీసులు స్పెష‌ల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మాస్క్ లేకుండా ఎవ‌రైనా బ‌య‌ట క‌నిపిస్తే వారికి భారీ జ‌రిమానా విధించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు సిద్ధమవుతున్నారు.

Read Also…  Raviprakash Arrest : మద్యం మత్తులో బైక్ నడిపి మహిళ మృతికి కారణమైన రవిప్రకాష్‌ని అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు