Schools Reopens: తెలంగాణలో కోవిడ్ కారణంగా పది నెలల పాటు మూతపడిన విద్యాసంస్థలు ఫిబ్రవరి 1 నుంచి తెరుచుకోనున్నాయి. సోమవారం నుంచి 9 నుంచి అపై తరగతులకు అనుమతించనుంది ప్రభుత్వం. దీంతో పాఠశాలలు,జూనియర్ కళాశాలలు, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌తోపాటు వృత్తి విద్యా కళాశాలలన్నీ తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 30 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 70 శాతానికిపైగా తల్లిదండ్రులు సమ్మతి పత్రాలు సమర్పించినట్లు అధికారులు చెబుతున్నారు.
అయితే విద్యాసంస్థల వద్ద శానిటైజర్లు, మాస్కులు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించింది.
9,10వ తరగతి విద్యార్థులే క్లాసులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇందుకు తల్లిదండ్రుల సమ్మతి పత్రం తప్పనిసరి. ఇంటర్మీడియేట్ తరగతులు కూడా నిర్వహించనున్నారు. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సమ్మతి పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఇక డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ సహా ఇతర వృత్తి విద్య కళాశాలల్లో రోజుకు 50 శాతం మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.
– పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు
– (హైదరాబాద్ జిల్లాలో ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
– జూనియర్ కళాశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
– డిగ్రీ ఆపై స్థాయి కళాశాలలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు