
యాదాద్రి జిల్లా వలిగొండ మండలం కేశిపల్లికి చెందిన ఉంగరాల యాదగిరి (110) నైజాం పుష్కర సేనలకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు. వారసత్వంగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందాడు. యాదగిరికి నలుగురు కొడుకులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉన్నంతలో పెంచి పెద్ద చేసి చదివించి పెళ్లిళ్లు కూడా చేశాడు. తనకున్న 50 ఎకరాల భూమిని నలుగురు కుమారులకు పదేసి ఎకరాల చొప్పున పంపిణీ చేశాడు. మిగతా పది ఎకరాలను ఇద్దరు కూతుర్లకు ఇచ్చారు. కొడుకుల ఇళ్ల నిర్మాణం కోసం రూ.25 లక్షలు ఇచ్చారు.
నలుగురు కొడుకులు సైతం హైదరాబాదులో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. వీరిలో మూడో కొడుకు అనారోగ్యంతో చనిపోయాడు. గ్రామంలోనే ఉంటూ దంపతులు జీవనం సాగిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. భార్య లక్ష్మమ్మ 2008లో చనిపోవడంతో యాదగిరికి కష్టాలు ప్రారంభమయ్యాయి. భార్య చనిపోయి వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కొడుకులు పట్టించుకోలేదు. ఆయన ఆస్తిని తీసుకున్న కొడుకులు ఆయన పోషణను గాలికి వదిలేసారు. కొడుకుల ఇంటికి వెళ్ళినప్పుడు కొట్టి తమ ఇళ్ల నుంచి గెంటేశారు.
కూతుర్లు, కొంత మంది బంధువుల సహాయంతో యాదగిరి కొంత కాలంగా హైదరాబాదులోని ఉప్పల్‌లో ఓ వద్ధాశ్రమంలో ఉంటున్నారు. జీవితం చరమాంకంలో ఉన్న తనను పట్టించుకోకుండా మానసిక క్షోభకు గురి చేస్తున్నారని కొడుకులపై జిల్లా రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. తన కొడుకులు తీసుకున్న 40 ఎకరాల భూమిని తనకు చెందేలా చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్ ను యాదిగిరి ఆశ్రయించాడు.
దీంతో మానవ హక్కుల కమిషన్ వృద్ధుడి పోషణకు సంబంధించి విచారణ జరిపి కొడుకులపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఉన్నతాధికారులకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే రజాకర్లపై పోరాడిన యాదగిరి కొడుకులపై విజయం సాధిస్తాడో లేదో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..