
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్ష భీభత్సం కొనసాగుతోంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలోని మెదక్, కామారెడ్డి జిల్లాలకు మరోసారి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇప్పటికే భారీ వర్షంతో మెదక్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, యాదాద్రి జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో రికార్డు వర్షపాతం నమోదైంది. రాజంపేటలో అత్యధికంగా 41.8 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
కామారెడ్డి, మెదక్ లో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లను అప్రమత్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని రేవంత్ ఆదేశించారు. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు.. అన్నిశాఖల అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. NDRF, SDRF సాయం తీసుకోవాలని సీఎస్‌కు ఆదేశించారు. మెదక్, కామారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలతో మాట్లాడిన సీఎం.. కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అధిక ప్రభావం ఉండడంతో సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని.. వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని.. కామారెడ్డి, మెదక్ కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్లు, పోలీస్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి.. సహాయక చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు పొంగులేటి.. కాగా.. వర్షాలు కురిసే జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. మెదక్ జిల్లా ప్రత్యేకాధికారిగా జెన్కో ఎండీ హరీష్ ను నియమించారు.
భారీ వర్షాలు, వరదలతో పోచారం డ్యామ్ డేంజర్‌లో పడింది. పోచారం డ్యామ్‌కు వరద పోటెత్తడంతో.. డ్యామ్ పక్కనుంచి వరద ప్రవహిస్తోంది. కట్టతెగే ప్రమాదం పొంచి ఉందని.. అధికారులు పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇవాళ రాత్రి వరద పోటు మరింత పెరగనుంది. పోచారం డ్యామ్ కట్ట తెగితే, పరిసరాల్లో జలవిలయం ముప్పు పొంచి ఉండటంతో.. డ్యామ్ కింద ఉన్న పది గ్రామాలు భయం గుప్పిట్లో ఉన్నాయి.. పోచారం, మాల్తుమ్, గోలిలింగాల, ఎంకంపల్లి, తాండూరు, పోచమ్మరాళ్, గాంధారిపల్లి, కుర్తివాడ, ఆరెపల్లి గ్రామాలకు ముప్పు పొంచి ఉండటంతో ఆయా ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశామని.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..