Graduate MLC election : తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లెక్క తేలింది. శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ ఎన్నికలపై దృష్టి సారించిన ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పట్టభద్రులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఎజెండాలను తెరమీదకు తెస్తున్నాయి. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం 2021 మార్చి 29న ఖాళీ కానుంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 23 రేపటితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. ఫిబ్రవరి 24న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 26 వరకు గడువు విధించారు. ఇక మార్చి 14న ఉదయం 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 17న ఫలితాలను ప్రకటిస్తారు.
హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి పోటీ భారీగా ఉంది. టీఆర్ఎస్ తరపున దివంగత నేత పీవీ నరసింహారావు కూతురు సురభి వాణీదేవి బరిలోకి దిగుతున్నారు. బీజేపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, టీడీపీ తరపున ఎల్ రమణ బరిలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఇండిపెంటెంట్ అభ్యర్థిగా మరోసారి పోటీ చేస్తున్నారు.
హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ స్థానానికి అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ చివరి వరకూ తీవ్ర స్థాయిలో కసరత్తు చేసింది. ఒక దశలో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇస్తారనే ప్రచారం జరిగింది. నామినేషన్ల దాఖలుకు గడువు దగ్గర పడటంతో..టీఆర్ఎస్ అధినేత వ్యూహత్మకంగా అడుగులు వేశారు. సామాజిక, రాజకీయ సమీకరణల లెక్కలన్నీ చూసుకుని సురభి వాణీదేవిని అభ్యర్థిగా ప్రకటించారు.
ఖమ్మం- నల్గొండ- వరంగల్ పట్టభద్రుల స్థానంలో టీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి రాములు నాయక్ రంగంలో దిగుతున్నారు. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, టీజేఎస్ నుంచి కోదండరాం పోటీ పడుతున్నారు. ఈ స్థానంలో టీఆర్ఎస్ ముందుగానే అభ్యర్థిని ప్రకటించడంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు పల్లా. ఇప్పటికే గ్రాడ్యుయేట్లతో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారంలో ఊపు పెంచారు.
రెండు ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో పది లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. నల్గొండ- ఖమ్మం- వరంగల్ నియోజకవర్గంలో 4,91,396 మంది హైదరాాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ స్థానంలో 5,17,883 మంది ఉన్నారు. ప్రస్తుతం నల్గొండ – ఖమ్మం- వరంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి, హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రరావు పదవీ కాలం ఈ నెల 29తో ముగియనుంది.
Read Also… బీజేపీ, ఎన్ ఆర్ కాంగ్రెస్ పార్టీలదే ఈ ‘నిర్వాకం’, పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి ఫైర్