Nagarjuna Sagar By Election : సాగర్‌లో స్పీడ్ పెంచిన పార్టీలు.. పేలుతోన్న మాటల తూటాలు, రోడ్‌షోలు.. డోర్‌ టు డోర్‌ ప్రచారంతో హోరు

Nagarjuna Sagar By Election : నాగార్జున సాగర్ బై పోల్‌ ప్రచారంతో మరింత హీటెక్కింది..

Nagarjuna Sagar By Election : సాగర్‌లో స్పీడ్ పెంచిన పార్టీలు.. పేలుతోన్న మాటల తూటాలు, రోడ్‌షోలు.. డోర్‌ టు డోర్‌ ప్రచారంతో హోరు
Nagarjunasagar By Election

Updated on: Apr 12, 2021 | 3:18 PM

Nagarjuna Sagar By Election : నాగార్జున సాగర్ బై పోల్‌ ప్రచారంతో మరింత హీటెక్కింది. ప్రధాన పార్టీల ముఖ్యనేతలు సాగర్ లో తిష్టవేసి ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్లాన్లలో బిజీగా ఉన్నారు. ప్రచార ఘట్టం చివరిదశకు చేరడంతో గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇక, నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలను టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. కాగా, మొదటి నుంచీ నాగార్జునసాగర్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి… ఇక్కడి నుంచి అనేకసార్లు విజయఢంకా మోగించారు. మళ్లీ సాగర్‌ స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ప్రముఖ నేతలంతా అక్కడే ఉండి ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రజల్ని దోచుకున్న టీఆర్‌ఎస్‌కి సాగర్ ప్రజలు బుద్ధిచెప్పాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. అవినీతి సొమ్ముతో ఉప ఎన్నికల్లో డబ్బు, మద్యం పారిస్తున్నారని.. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

ఇక టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా గత ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యహరించి నాగార్జుసాగర్‌ స్థానంలో విజయబావుటా ఎగురవేసింది. ఇప్పుడు నోముల భగత్‌ను రంగంలోకి దించి ప్రచారం జోరు పెంచింది. మంత్రులు జగదీష్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ సహా… టీఆర్ఎస్‌ ప్రముఖ నేతలంతా సాగర్‌పై ఫోకస్‌ పెట్టారు. ఎలాగైనా సిట్టింగ్‌ సీటును నిలబెట్టుకోవాలని ప్లాన్‌ చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గ అభివృద్దితోపాటు ప్రతి ఎకరాకు నీరందిస్తామని హామీ ఇస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. మూడున్నర దశాబ్ధాలు ఎమ్మెల్యేగా ఉన్నా ఏమీ చేయని జానారెడ్డిని, మాటలకే పరిమితమైన బీజేపీని ప్రజలు తిరస్కరిస్తారంటున్నారు మంత్రి జగదీశ్‌రెడ్డి.

అటు దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపుతో మాంచి ఊపు మీదున్న కాషాయం పార్టీ కూడా ప్రచారంలో స్పీడ్‌ పెంచింది. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలు నాగార్జున సాగర్‌ ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. చెంతనే సాగర్‌ ఉన్నా… త్రాగటానికి గుక్కెడు నీళ్లు లేవంటూ ఆయా పార్టీలను విమర్శించారు కిషన్‌రెడ్డి. మొత్తానికి నాగార్జునసాగర్‌లో ప్రధాన పార్టీలు ప్రచార స్పీడ్‌ పెంచాయి. రోడ్‌షోలు, డోర్‌ టు డోర్‌ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతోంది.

Read also :  Sailajanath : వైసీపీకి 23వ ఎంపీ ఎందుకో అర్థం కావడం లేదు, ప్రచారంలో పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు