Telangana Politics: ఆ వ్యూహంతోనే బీజేపీని టీఆర్ఎస్ హైప్ చేస్తోంది.. టీ కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana Congress: తెలంగాణలో తదుపరి కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ (Madhu Yaskhi Goud) ధీమా వ్యక్తంచేశారు.
Telangana Congress: హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) ప్లీనరీలో అదే పనిగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీని టార్గెట్ చేసిన టీఆర్ఎస్ నేతలు.. మరో రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ లైట్ తీసుకుంటోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. బీజేపీని ఎదుర్కోవడంపైనే ఫుల్ ఫోకస్ పెట్టినట్లు టీఆర్ఎస్ నేతలు తమ వ్యాఖ్యలతో చెప్పకనే చెప్పారు. అయితే ఈ అంశంపై తెలంగాణ పీసీసీ నేత, పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ (Madhu Yaskhi Goud) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 30 సీట్లకు మించి దక్కవని సీఎం కేసీఆర్‌కు రిపోర్ట్ ఉందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో ముక్కోణ పోటీ రావాలని టీఆర్ఎస్ కోరుకుంటోందన్నారు. అందుకే బీజేపీని టీఆర్ఎస్ నేతలు హైప్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ముక్కోణ పోటీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే లబ్ధి పొందాలన్నది కేసీఆర్ వ్యూహంగా పేర్కొన్నారు.
అయితే తెలంగాణలో తదుపరి కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని మధుయాష్కీ ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న భయంతోనే టీఆర్ఎస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయంటూ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. రాహుల్ గాంధీ సభ కోసం పార్టీ నేతలు సమిష్టిగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట రాహుల్ గాంధీ మీటింగ్ పెడితే బాగుంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించినట్లు తెలిపారు.
తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులైన తలసాని, గంగుల, దానం వంటి వారిని పక్కనబెట్టుకుని కేసీఆర్ ప్లీనరీ నిర్వహించడం విడ్డూరమని మధుయాష్కీ అన్నారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా చెప్పుకునే కేసీఆర్‌కు ఇన్ని అస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అతి తక్కువ సమయంలో ఇన్ని వందల కోట్లు కేసీఆర్‌కు ఎలా వచ్చాయన్నారు.
మరిన్ని రాజకీయ వార్తలు చదవేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read..
Hyderabad: నగరంలో ఫ్లెక్సీలు.. మంత్రి తలసానికి రూ.50వేలు ఫైన్