Telangana: క్లైమాక్స్‌కు చేరిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. వీధుల్లో హోరెత్తిస్తున్న నేతలు..

మరి కొన్ని గంటల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడనుంది. దీంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు.. కేటీఆర్, హరీష్ రావు వ్యూహ ప్రతివ్యూహాలు.. బీజేపి అగ్రనేతల దూకుడుతో వీధులన్నీ హోరెత్తుతున్నాయి

Telangana: క్లైమాక్స్‌కు చేరిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. వీధుల్లో హోరెత్తిస్తున్న నేతలు..
Telangana Municipal Election Campaign

Updated on: Feb 08, 2026 | 10:01 PM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం క్లెమాక్స్‌కు చేరుకుంది. సోమవారం సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచార హోరు ముగియనుంది. రెండు వారాలుగా ప్రధాన పార్టీల ప్రచారపర్వం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. సాయంత్రంతో ప్రచారానికి తెరపడుతుండటంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నాల్లో మునిగిపోయారు. ప్రచారానికి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో అన్ని పార్టీల అగ్రనేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. 5 నుంచి 6 మున్సిపాలిటీలను చుట్టేస్తూ సుడిగాలి ప్రచారంతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి బహిరంగసభల ద్వారా ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు. ఇటు మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రోడ్‌షోలు, సుడిగాలి పర్యటనలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. బీఆర్ఎస్ తరపున ప్రచార బరిలోకి దిగిన కేటీఆర్, హరీష్‌ రావు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాల్లో ప్రచారంపై దృష్టి పెట్టారు. బీజేపీ ప్రచారంలో కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, రాంచందర్‌ రావులతో పాటు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖ నేతలు చేస్తున్న ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మహరాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌, మాజీ ఎంపీ నవనీత్‌ కౌర్‌ బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇటు అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు పాదయాత్రలు, బైక్‌ ర్యాలీలు, ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్‌ నిఘా వ్యవస్థను సిద్ధం చేస్తోంది. ఈ నెల 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలవరకు 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్‌ జరుగనుంది. 13న కౌంటింగ్‌ నిర్వహిస్తారు. 100శాతం వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షిస్తామని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటూ 30 జిల్లాల్లోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో 11,000 కంటే ఎక్కువ స్మార్ట్‌ కెమెరా యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. రెండు వారాలుగా హోరా హోరీగా జరిగిన పార్టీల ప్రచార పర్వంతో పురపాలికల ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారో ఈ నెల 13న కౌంటింగ్‌లో తేలిపోనుంది.