Vemula Prashanth reddy letter : తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో పెద్ద దుమారమే రేపడంతో ఇవాళ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలు ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్ని ఉద్దేశించి చేసినవి కాదని చెప్పారు. తన మాటలు నీటి దొంగలైన ఆంధ్ర పాలకుల మీదేనని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కూలంకుషంగా ఒక లేఖ విడుదల చేశారు ప్రశాంత్ రెడ్డి. నిన్న తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పిన ప్రశాంత్ రెడ్డి..
“సోనియా గాంధీకి తెలంగాణ ఇవ్వాలని ఉన్నా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడింది వైయస్ రాజశేఖర్ రెడ్డి కాదా..? అనేక మంది తెలంగాణ బిడ్డల చావుకు కారణం కాదా..? తెలంగాణ నీళ్లను ఆంధ్రకు తరలించిన నీటి దొంగ వైయస్. అంతకు రెట్టింపు నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్న వైయస్ జగన్ ను ఏమనాలి” అని తన లేఖలో ప్రశాంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ రెడ్డి లేఖ పూర్తి పాఠం ఈ దిగువున చూడొచ్చు.
ఇదిలా ఉండగా, ఏపీలో రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్‌డీఎస్ విస్తరణ జరుగుతుండగా, ఇటు తెలంగాణలో కొత్త ప్రాజెక్ట్‌లకు రూపకల్పన జరుగుతోంది. ఈ పరిస్థితులు రెండు రాష్ట్రాల మధ్య మరోసారి నీటి యుద్ధానికి దారితీస్తున్నాయి. ఇటు వైపు, అటు వైపు నుంచి మంత్రుల స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఆర్‌డీఎస్ విస్తరణ పనులతో మొదలైన ఈ జగడం మరింత పెద్దదవుతోంది. ఈ నేపథ్యంలోనే నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి.
లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులేనని, ఆంధ్రోళ్లు అందరూ తెలంగాణ వ్యతిరేకులేని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రాజెక్ట్‌లపై యుద్ధానికి సిద్ధం కావాలని పాలమూరు ప్రజలకు పిలుపునిచ్చారు. అక్రమ ప్రాజెక్ట్‌లను ఆపకపోతే పోరాటం తప్పదని ఏపీ సీఎం జగన్‌ను హెచ్చరించారు తెలంగాణ మంత్రి. కొత్త ప్రాజెక్ట్‌లు కట్టడం లేదని గ్రీన్‌ట్రిబ్యునల్‌కు చెప్పి దొంగతనంగా కడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ అన్ని వివరాలు తెప్పించారని, త్వరలోనే ప్రధానికి కూడా ఫిర్యాదు చేస్తారని చెప్పారు. అయినా ప్రాజెక్ట్‌లు ఆపకపోతే యుద్ధం తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంలోనే దివంగత నేత వైఎస్‌పైనా విమర్శలు చేశారు ప్రశాంత్‌రెడ్డి. ఆంధ్రోళ్లంతా తెలంగాణ వ్యతిరేకులేనని వ్యాఖ్యానించారు.
తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆంధ్ర ప్రజలను లంక వాసులతో పోల్చడంపై.. మండిపడ్డారు కర్నూలు జిల్లా టిడిపి నేతలు. ఎప్పుడో జరగాల్సిన ఆర్‌డీఎస్ కుడి కాలువ పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కృష్ణ, గోదావరి ట్రిబ్యునల్ నుండి ఇష్టం వచ్చినట్టి జలచౌర్యం చేస్తుందని ఆరోపించారు కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ తిక్కారెడ్డి. తమకు రావాల్సిన 4టీఎంసీల నీటి వాటా ప్రకారం టెండర్ వేసి కుడి కాలువ పనులు జరుగుతున్నాయని చెప్పారాయన. మంత్రాలయం నియోజవర్గంలో తాగునీటికి, రాఘవేంద్ర స్వామి అభిషేకం కూడా నీరు దొరకని పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
Vemula Letter 1
Read also : Elephant herd : చిత్తూరు జిల్లా పలమనేరులో భారీ ఏనుగుల గుంపు, భయాందోళనలో ప్రజలు