స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రం అసాధారణ ప్రగతిని కనపర్చింది.. తెలంగాణలోని పల్లెలు, జిల్లాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి.. కొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేయడంలో తెలంగాణ దేశానికి స్ఫూర్తినిస్తోందని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ చిన్న వయస్సు రాష్ట్రమైనా.. దేశంలోనే ఉత్తమ పనితీరును కనబర్చిందన్నారు. మిషన్ భగీరథ, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అవార్డులు.. దార్శనికత కలిగిన సీఎం కేసీఆర్ వల్లే వచ్చాయని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అత్యధికంగా అవార్డులు సాధించిన రెండో రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. అయితే రాష్ట్రానికి అవార్డులు ఇచ్చేది కేంద్రమే.. మళ్లీ రాష్ట్రంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి లేదంటూ విమర్శించేది కేంద్రమే అని విమర్శించారు. కానీ ఎందుకిలా జరుగుతుందనేది అందరూ అర్ధం చేసుకోవాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కోరారు.
అద్భుతంగా పురోగతి సాధిస్తున్న గ్రామాలు, పట్టణాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించిన మున్సిపాలిటీలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఈ నిధులను ప్రత్యేకంగా పారిశుధ్యం కోసం వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు- 2022 సాధించిన మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, కమిషనర్ల అభినందన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కేటీఆర్ సూచించారు. కాగా.. ఈ నిధులను బడంగ్‌పేట్, కోరుట్ల, సిరిసిల్ల, తుర్కయాంజాల్, గజ్వేల్, వేములవాడ, ఘట్‌కేసర్, కొంపల్లి, హుస్నాబాద్, ఆదిభట్ల, కొత్తపల్లి, చండూర్, నేరేడుచర్ల, చిట్యాల, భూత్‌పూర్, అలంపూర్, పీర్జాదిగూడ, తదితర మున్సిపాలిటీలకు మంజూరు చేయనున్నారు. మొత్తం 19 మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
Minister @KTRTRS congratulated winners of ‘Swachh Survekshan 2022′ and ‘Indian Swachhata League 2022’ Awards who gathered in Hyderabad. pic.twitter.com/KO1SuDAJL8
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 4, 2022
కాగా.. అవార్డులు సాధించిన మున్సిపాలిటీలకు చెందిన చైర్‌పర్సన్లను, కమిషనర్లను, అడిషనల్ కలెక్టర్లను స్టడీ టూర్‌కు పంపించి, మరిన్ని ఉత్తమ పద్ధతులపైన అధ్యయనం చేసేందుకు అవకాశం కల్పిస్తామని కేటీఆర్ స్పష్టంచేశారు. ఇందులో నుంచి పదిమందిని ఎంపిక చేసి జపాన్, సింగపూర్‌కు అధ్యయనానికి పంపిస్తామని వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..