Minister Harish Rao: తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు మంత్రి అవతారం ఎత్తారు. స్వయంగా పొలంలోకి దిగి వరి విత్తనాలు చల్లారు. విత్తనాలు వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేస్తే రైతన్నలకు లాభాలు బాగా ఉంటాయని చెప్పిన మంత్రి హరీష్ రావు.. స్వయంగా పొలంలోకి దిగి ఆ విధానంపై రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఆదివారం నాడు జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. సాగుక్షేత్రం వేదికగా.. పోలంలోకి స్వయంగా దిగి వెదజల్లే పద్ధతిలో వరిసాగుపై రైతులకు మంత్రి హరీష్ రావు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి ఆయన మాట్లాడారు. వరి పంటను వెదజల్లే పద్దతిలో పండిస్తే అధిక లాభాలు వస్తాయని పేర్కొన్నారు. వెదజల్లే పద్దతిలో వరి పంట సాగు చేస్తే ఎకరానికి 2-3 క్వింటాళ్ల దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉందని వివరించారు. ఈ వరి ధాన్యం విత్తనాలను వెదజల్లే పద్ధతి ద్వారా బురదలో కాలు పెట్టకుండానే వరి పంట నాటుకోవచ్చని అన్నారు.
‘‘నారు పోసే పని లేదు. నాటు పెట్టే పని లేదు. కూలీల కోసం గొడవ లేదు. కలుపు కూలీల ఇబ్బంది లేదు. నీటి వినియోగం 30- 35 శాతం తగ్గుతుంది. 10-15 రోజుల ముందే పంట చేతికి అందుతుంది. సాధారణ పద్ధతిలో అయితే ఎకరానికి 25 కిలోల విత్తనాలు కావాలి. ఈ వెదజల్లే పద్ధతి అయితే 8 కిలోల విత్తనాలు సరిపోతాయి. వడ్లు చల్లిన తరువాత ఎన్ని రోజులకైనా నీళ్లు కట్టుకోవచ్చు. విత్తనపొడ్లు వెదజల్లిన తరువాత వర్షం పడే వరకు కొన్నిరోజులు ఎదురు చూస్తే ఇంకా మంచిది. సిద్దిపేట జిల్లాలో వరి సాగు చేసే రైతులందరూ ఈ వెదజల్లే పద్దతిని అనుసరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.’’ అని మంత్రి హరీష్ రావుకు రైతులకు వివరించారు.
కాగా, వెదజల్లే పద్దతిలో వరి సాగు చేసే అంశంపై సిద్దిపేట జిల్లా రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, అధికారులు ముత్యం రెడ్డి, విజయేంద్ర రెడ్డి, మండల ఎంపీపీ, జడ్పీటీసీ, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Harish Rao Farming Video:
Also read:
Telangana Inter Results: రేపే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు.. ఎలా చెక్ చేసుకోవాలంటే..
Kurnool Heavy rains: కర్నూలు జిల్లాలో ముంచెత్తిన భారీ వర్షాలు.. నీట గ్రామాలు.. పొంగుతున్న వాగులు