Minister Harish Rao: తెలంగాణ అంటే బీజేపీకి కడుపు నిండా విషమే.. సంచలన కామెంట్స్ చేసిన మంత్రి హరీష్ రావు..

|

Feb 10, 2022 | 7:21 PM

Telangana Politics: తెలంగాణ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్స్, బీజేపీ నేతల వైఖరిపై రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు.

Minister Harish Rao: తెలంగాణ అంటే బీజేపీకి కడుపు నిండా విషమే.. సంచలన కామెంట్స్ చేసిన మంత్రి హరీష్ రావు..
Follow us on

Telangana Politics: తెలంగాణ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్స్, బీజేపీ నేతల వైఖరిపై రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ అంటే బీజేపీకి కడుపు నిండా విషమే అంటూ ధ్వజమెత్తారు. ‘మీకు తెలంగాణలో నూకలు చెల్లాయి. నిధులు ఇవ్వరు.. సూటి పోటి మాటలు అంటారు. అమరుల త్యాగాలను తక్కువ చేస్తారు. మీరు ఎన్ని చేసినా రాష్ట్రం పురోగతిలో ఉంటది. అభివృద్ధి ఆగదు. ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధిలో టాప్ 10లో దేశంలో 7 తెలంగాణవి ఉన్నాయి. వివిధ రంగాల్లో కేంద్రం నుండి అనేక అవార్డులు ఇచ్చారు. ఇది మా పని తీరు. కండ్లు కనిపిస్తలేదా? బుధవారం నాడు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఇంకో మాట కూడా అన్నారు. రాష్ట్రాలు, కేంద్రం కలిసి ఉండాలని నీతులు బాగా చెబుతారు. మరి ఎందుకు మా ఏడు మండలాలను ఆదరాబాదరాగా ఆంధ్రాలో కలిపారు? ఎందుకు సీలేరు ప్రాజెక్టును ఏపీకి అప్పగించారు? నువు చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్పా?’’ అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. శునివారం నాడు హన్మకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థాపన చేశారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

వలస జీవులపై చిన్నచూపు ఎందుకు?..
‘‘తెలంగాణపై విషం కక్కిన మోడీ.. ఇప్పుడు వలస జీవులపై విషం కాక్కారు. కరోనా సమయంలో ఎంతో మంది వలస జీవులు బతికి ఉంటే చాలు అనుకుంటే.. మోడీ వారిపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడారు. వలస కార్మికులకు సమయం ఇవ్వలేదు. అకస్మాత్తుగా లాక్ డౌన్ పెట్టారు. ఎంతో మంది నరకం చూశారు. అలాంటి సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. వలస కార్మికులకు భోజనం పెట్టి, జేబులో డబ్బులు పెట్టి, రైళ్లు ఏర్పాటు చేసి ఇళ్లకు పంపారు. ఇలా వలస కార్మికులకు అనేక మంది, సేవా సంస్థలు సహకారం అందించాయి. అందరినీ అభినందిచాల్సింది పోయి.. మోడీ విమర్శలు చేస్తున్నారు. వారిని ఇంటికి పంపడం వల్లనే కరోనా పెరిగింది అని అవమాన పరిచారు. వలస జీవులపై ఎందుకు మోడీకి చిన్న చూపు. వలస కార్మికుల కష్టాలు అర్థం చేసుకోవడంలో కేంద్రం ఫెయిల్ అయ్యింది. మీరు ట్రంపును తీసుకువచ్చి, మీటింగ్ లు పెడితే, ఎన్నికల ర్యాలీలు పెడితే కరోనా పెరగలేదు కానీ.. వలస కార్మికుల వల్ల పెరిగిందా? ఇంత కంటే దారుణం ఇంకొకటి ఉంటదా? పొట్ట చేత పట్టుకొని ఉన్న వారిపై నిందలు వేయడం కంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉండదు.’’ అని మంత్రి హరీష్ రావు అన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచారు..
‘‘మొన్న తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచారు. తెలంగాణ ఉద్యమ కారుల బలిదానాలను కించ పరిచారు. తెలంగాణ ఏర్పాటును తక్కువ చేయడం అంటే.. అమరులకు కించపరచడం, ఉద్యమాన్ని కించ పరచడమే. వరంగల్‌ లోనే ఎంతో మంది బలిదానాలు చేశారు. ఎన్ని త్యాగాలు, ఎన్ని శవాలు మోసాము. అప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికించారు అని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటు సక్రమంగా జరగలేదు అంటున్నారు. తెలంగాణపై ఎప్పుడూ విషం చిమ్మడమే మోడీ పనిగా పెట్టుకున్నారు. తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చింది? వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు? దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఇస్తే.. తెలంగాణకు ఒక్కటి కూడా ఎందుకివ్వలేదు?. నవోదయ పాఠశాలలు, ఐఐఎం, ఐఐఐటీ, ఒక్కటి కూడా ఎందుకివ్వలేదు?. అన్నింటా తెలంగాణకు మొండి చేయి చూపారు. మాటలతో హింస పెడుతున్నారు. తెలంగాణ ప్రజలను అవమానించేలా వారి చర్యలున్నాయి. అందరూ వ్యతిరేకిస్తున్నా కూడా వ్యవసాయ చట్టాలు ఎలా చేశారు?’’ అని తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం, బీజేపీ వైఖరిని ఎండగట్టారు.

వైద్యారోగ్యంపై..
హన్మకొండలో టి-డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పాటు కోసం శంకుస్థాపన చేయడంతో పాటు, మథర్ మిల్క్ బ్యాంక్, టీబీ స్పెషాలిటీ క్లినిక్, బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ఎంజీఎం ఆసుపత్రిలో 42 పడకల పీడియాట్రిక్ కేర్ యూనిట్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పుట్టిన పిల్లల కోసం నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు, పెద్ద వాళ్ల కోసం అడల్ట్ ఐసీయూ, తల్లుల కోసం మెటర్నల్ ఐసీయూలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పుడు కొత్తగా చిన్నారుల కోసం పీడియాట్రిక్ ఐసీయూ యూనిట్లను మొదటి సారిగా ప్రారంభించడం జరిగిందన్నారు.

నీలోఫర్ ఆసుపత్రిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మార్చి హబ్ అండ్ స్పోక్ మోడల్లో 33 జిల్లాల్లో ప్రత్యేకంగా పీడియాట్రిక్ ఐసీయూలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని మంత్రి హరీష్ రావు వివరించారు. ఇందుకోసం రూ. 86 కోట్లు ఖర్చు చేయబోతున్నామని చెప్పారు. ఈ క్రమంలో మొదటి పీడియాట్రిక్ ఐసీయూని హన్మకొండలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక మదర్ మిల్క్ బ్యాంక్‌ను కూడా ప్రారంభించడం జరిగిందన్నారు మంత్రి హరీష్ రావు. పుట్టిన ప్రతి బిడ్డకు గంట వ్యవధిలో తల్లి పాలివ్వాలని, దీన్నే గోల్డెన్ అవర్ అంటారని పేర్కొన్నారు. ఒకవేళ తల్లులకు పాలు రాకపోవడం, సిజేరియన్, శిశువుల అనారోగ్యం తదితర కారాణాల వల్ల తల్లి, బిడ్డలను వేర్వేరు చోట ఉంచాల్సి వస్తే.. ఈ మదర్ మిల్క్ బ్యాంక్ నుంచి పాలను తీసుకుని తాపవచ్చన్నారు. నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్న మదర్ మిల్క్ బ్యాంక్ అద్భుతమైన సేవలందిస్తోందన్నారు. హైదరాబాద్ తర్వాత హన్మకొండలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహించే టి- డయాగ్నోస్టిక్ సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 20 జిల్లాల్లో ఉండగా, 13 జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతి చోట పాథాలజీ, రేడియాలజీ సేవలు ఉండేలా చూస్తున్నామని పేర్కొన్నారు. దీని కోసం ఒక్కో సెంటర్ పై రూ. 3.5 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు.

నర్సంపేట్ 200, భూపాలపల్లి 300, ములుగు 200, మహబూబాబాద్ 200 పడకల ఆసుపత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. దీనికి తోడు వరంగల్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో 2,000 పడకలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో 2,900 పడకలు అందుబాటులోకి రానున్నాయన్నారు. వరంగల్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ అని చెప్పుకొచ్చారు మంత్రి హరీష్ రావు. అందుకే వరంగల్ ను హెల్త్ సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. హన్మకొండలో ఇప్పటికే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఉండగా, అత్యాధునిక వైద్య సదుపాయాలు, సూపర్ స్పెషాలిటీ సేవలతో కూడిన హెల్త్ సిటీని 215.35 ఎకరాల్లో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. 15 ఎకరాల్లో రూ. 1,100 కోట్లతో భారీ భవన సముదాయాన్ని నిర్మించబోతున్నామని చెప్పారు. 2,000 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనున్నదని వెల్లడించారు మంత్రి హరీష్ రావు.

విద్య, వైద్యానికి పెద్దపీట..
విద్యతో పాటు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. పల్లె ప్రజల కోసం పల్లె దవాఖానలు, పట్టణ ప్రజల కోసం బస్తీ దవాఖానలు, జిల్లాకొక మెడికల్ కాలేజీ, హైదరాబాద్ నలువైపులా ఎయిమ్స్ తరహాలో నాలుగు టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. 8 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ పరిధిలోని మహబూబాబాద్‌లో కొత్త మెడికల్ కాలేజీ వస్తోందన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 700 మాత్రమే ఉంటే, ఇప్పుడు వాటిని 2,850కి పెంచుకుంటున్నామని చెప్పారు. పీజీ సీట్లు నాడు 531 మాత్రమ ఉంటే, ఏడేండ్లలో 938కి పెంచుకున్నామని వెల్లడించారు. భవిష్యత్‌లో వీటన్నింటిని మరింత పెంచుకొని, వైద్య రంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శవంతంగా నిలుస్తుందని అన్నారు.

దేశంలోనే తెలంగాణ మూడో స్థానం..
తెలంగాణ వైద్య రంగం దేశంలోనే అత్యుత్తమమైందని కేంద్ర ప్రభుత్వ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానం అని నీతి అయోగ్ చెప్పగా, అందులో బీజేపీ పాలిత, మోడీ ప్రాతినిధ్య యూపీ చిట్టచివరన నిలిచిందన్నారు. ప్రజా వైద్యంపై తెలంగాణ ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోందని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే రాజ్యసభలో చెప్పిందని గుర్తు చేశారు. ఒక్కొక్కరి ఆరోగ్యం కోసం రూ. 1,698 తలసరి ఖర్చు చేస్తూ దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందన్నారు. ఇకపోతే కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలోనూ తెలంగాణ ముందంజలో ఉందన్నారు.

Also read:

Andhra Pradesh: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు..

Valentine’s Day: ఫిబ్రవరి 14 పై విహెచ్‌పి, భజరంగ్‌ దళ్ నేతల కీలక ప్రకటన.. ఇంతకీ వారేమన్నారంటే..

Pregnancy Care: గర్భధారణ సమయంలో బరువు తగ్గుతున్నారా? అయితే విషయాలను తప్పక తెలుసుకోవాల్సిందే..!