Telangana: నిరుద్యోగులకు బిగ్ షాక్.. ఆ డిగ్రీలు ఇక చెల్లవు.. హైకోర్టు సంచలన తీర్పు..

డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీలు పూర్తి చేసి.. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. పక్క రాష్ట్ర వర్సిటీలకు చెందిన స్టడీ సెంటర్ల ద్వారా పొందిన డిగ్రీలు కేవలం కాగితపు ముక్కలే తప్ప, సర్కారీ కొలువులకు అవి ఏమాత్రం పనికిరావని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ తీర్పుకు సంబంధించిన మరిన్ని విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: నిరుద్యోగులకు బిగ్ షాక్.. ఆ డిగ్రీలు ఇక చెల్లవు.. హైకోర్టు సంచలన తీర్పు..
Telangana High Court Distance Education Verdict

Updated on: Apr 24, 2026 | 10:26 PM

దూరవిద్యా విధానంలో డిగ్రీలు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఇతర రాష్ట్రాలకు చెందిన విశ్వవిద్యాలయాలు తమ రాష్ట్ర సరిహద్దులు దాటి నిర్వహిస్తున్న స్టడీ సెంటర్ల ద్వారా పొందే డిగ్రీలు ప్రభుత్వ ఉద్యోగాలకు పనికిరావని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022లో విడుదల చేసిన లైబ్రేరియన్ పోస్టుల నోటిఫికేషన్ ఈ వివాదానికి మూలమైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న కొందరు అభ్యర్థులు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ పూర్తి చేశారు. అయితే వీరు ఈ డిగ్రీని ఏపీలో కాకుండా తెలంగాణలో ఉన్న ఆ వర్సిటీ స్టడీ సెంటర్ల ద్వారా దూరవిద్యా విధానంలో పొందారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో వీరి డిగ్రీలు చెల్లవని టీజీపీఎస్సీ తిరస్కరించడంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఇదే తరహా డిగ్రీలతో కొందరికి ఉద్యోగాలు వచ్చాయని వారు వాదించారు.

హైకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక రాష్ట్ర చట్టం కింద ఏర్పడిన విశ్వవిద్యాలయం తన కార్యకలాపాలను ఆ రాష్ట్ర సరిహద్దులకే పరిమితం చేయాలి. ఇతర రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లు పెట్టి డిగ్రీలు ఇవ్వడం యూజీసీ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. 2013లో యూజీసీ జారీ చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం.. ఏ వర్సిటీ కూడా తన ప్రాదేశిక అధికార పరిధిని దాటి వెళ్లకూడదు. తెలంగాణలో ఏపీ వర్సిటీ సెంటర్లు నిర్వహించడం చట్టవిరుద్ధమని కోర్టు తెలిపింది. 2017 నియామకాల్లో ఇలాంటి డిగ్రీలను అంగీకరించారు కదా అని అభ్యర్థులు చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. “గతంలో జరిగిన అవకతవకలు లేదా తప్పులను.. కొత్త తప్పులకు సమర్థనగా వాడలేము” అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలు స్టడీ సెంటర్ల నిర్వహణకు అనుమతిస్తాయన్న వాదనను కూడా కోర్టు తిరస్కరించింది.

ఎవరిపై ప్రభావం చూపుతుంది..?

ఈ తీర్పు కేవలం లైబ్రేరియన్ పోస్టులకే పరిమితం కాకుండా రాబోయే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఉంటూ పక్క రాష్ట్రాల వర్సిటీల (ఉదాహరణకు ఆచార్య నాగార్జున, అన్నామలై, మదురై కామరాజ్ వంటివి) స్టడీ సెంటర్ల ద్వారా డిగ్రీలు పొందిన వారు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో 71 లైబ్రేరియన్ పోస్టుల భర్తీ ప్రక్రియను చట్టబద్ధంగా కొనసాగించడానికి టీజీపీఎస్సీకి మార్గం సుగమమైంది.

Follow Us