నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా హాలియాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 14న తలపెట్టిన ఎన్నికల బహిరంగసభకు అడ్డంకులు తొలగిపోయాయి. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా హాలియాలో సీఎం కేసీఆర్ నిర్వహించబోతున్న సభను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. రోస్టర్ ఉన్న బెంచ్‌కు ఈ కేసులు బదిలీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు రేపు, ఎల్లుండి హైకోర్టుకు సెలవులు ఉన్నాయి. కేసీఆర్ సభ బుధవారం కావడంతో దీనిపై విచారణకు అవకాశం లేకుండా పోయింది. ఇక, సీఎం సభకు అడ్డంకులు తొలిగినట్లేనని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. సభను రద్దు చేయాలంటూ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. నాగార్జునసాగర్ స్వతంత్ర అభ్యర్ధి సైదయ్య, సభ నిర్వహించే భూముల రైతులు పిటిషన్లు వేశారు. మరోవైపు సీఎం సభ రద్దు చేయాలని రాష్ట్ర మానవహక్కుల కమీషన్ లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచల యుగేందర్ పిర్యాదు చేశారు.
ఇదిలావుంటే, ఈనెల 17వ తేదీన జరిగే నాగార్జున సాగర్ బైపోల్ కోసం ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ప్రచారబరిలోకి దిగుతున్నారు. ఈ నెల 14న హాలియా శివారులో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొనే టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పెద్దవూర మార్గంలోని 20 ఎకరాల ఖాళీ స్థలంలో ఈ సభను పెద్దఎత్తున నిర్వహించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సాగర్ నలుమూలల నుంచి జనసమీకరణ చేయాలని నిర్ణయించారు. పార్కింగ్ కోసమే 30 ఎకరాలను కేటాయించారు.
కాగా, ఈనెల 17వ తేదీన ఉపఎన్నిక జరగనుంది. 15వ తేదీ సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా ఒక రోజు ముందు కేసీఆర్ సభకు ప్లాన్ చేశారు. సాగర్ ఉపఎన్నికకు దిశానిర్దేశం చేసేలా ఈ సభ ఉంటుందని భావిస్తున్నారు. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో నిబంధనల మేరకు సభ నిర్వహించాలని పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. సభకు వచ్చేవాళ్లంతా తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.