దానం నాగేందర్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. బీఆర్ఎస్, బీజేపీ నేతల సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ హైకోర్టు దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించడంతో ఖైరతాబాద్ ఉపఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఆయనపై ఈ తీర్పు వచ్చింది. బీఆర్ఎస్, బీజేపీ నేతలు తీర్పును స్వాగతిస్తూ, ఫిరాయింపులపై కాంగ్రెస్ డొల్లతనాన్ని ఎండగట్టారు. మిగిలిన ఫిరాయింపుదారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు.

దానం నాగేందర్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. బీఆర్ఎస్, బీజేపీ నేతల సంచలన వ్యాఖ్యలు!
Danam Nagender

Updated on: Sep 18, 2026 | 5:13 PM

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీఆర్ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించింది. 2024 ఏప్రిల్ 23 నుంచి ఆయన శాసనసభ సభ్యత్వానికి అనర్హత వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టు పక్కనపెట్టింది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్‌ తరఫున ఖైరతాబాద్ నుంచి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరో పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని ఆధారంగా చూపుతూ ఆయనపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అంతకుముందు స్పీకర్ దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్‌ను తిరస్కరించారు. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజా తీర్పుతో ఖైరతాబాద్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే తీర్పుపై తదుపరి న్యాయపరమైన చర్యలు ఎలా ఉంటాయన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే పరిణామం ఉంటుందని పేర్కొన్నారు. ఈమేరకు ఆయనన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి కూడా తీర్పును స్వాగతిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. దానం నాగేందర్‌ విషయంలో స్పీకర్‌ వ్యవహరించిన తీరుపై కోర్టు జోక్యంతో ప్రశ్నలు తలెత్తాయని అన్నారు. ఫిరాయింపులపై కాంగ్రెస్‌ 2024 మేనిఫెస్టో హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను చట్టప్రకారం పరిష్కరించాలని, వారితో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరాలని డిమాండ్ చేశారు.

దానం నాగేందర్‌ అనర్హతపై హైకోర్టు తీర్పు సీఎం రేవంత్‌రెడ్డికి చెంపపెట్టు అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. పార్టీ మారిన మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా అనర్హులేనని పేర్కొన్నారు. ఓ పార్టీపై గెలిచి మరో పార్టీలో చేరితే అనర్హత తప్పదన్నారు. ఖైరతాబాద్ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని కౌశిక్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తీర్పును స్వాగతించారు. ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను కూడా చట్ట ప్రకారం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ తీర్పు తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశంపై మరోసారి రాజకీయ, రాజ్యాంగ చర్చకు దారితీసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us