
తెలంగాణలో గతకొన్ని రోజులుగా టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1పై రాజకీయ రచ్చ నడుస్తోంది. గ్రూప్-1 పరీక్షపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రూప్1 నియామకాల్లో కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్నారు. పరీక్ష రాయని 10 మందికి ఫలితాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. పరీక్షను వెంటనే రద్దు చేసి సీబీఐ విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు కౌశిక్‌రెడ్డి. ఇలా కౌశిక్‌రెడ్డితో పాటు మరికొందరు విపక్ష నేతలు సైతం గ్రూప్1పై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో రంగంలోకి దిగిన టీజీపీఎస్సీ… గతకొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణలను ఖండించింది.
కొందరు దురుద్దేశంతోనే గ్రూపు-1 పరీక్ష పై అసత్య ప్రచారం చేస్తున్నారని టీజీపీఎస్సీ మండిపడింది. ఆ దురుద్దేశం వెనుక ప్రయివేట్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేసింది. ప్రొటోకాల్ ప్రకారమే నిపుణులతో వాల్యుయేషన్ చేయించినట్లు తెలిపింది. లిమిటెడ్ మార్కుల పరీక్షలో ఒకే తరహా మార్కులు రావడం సహజమని వెల్లడించింది. అంతమాత్రాన అక్రమాలు జరిగాయని అభ్యర్థులను, తెలంగాణ సమాజాన్ని తప్పబట్టడం సరికాదని హితవు పలికింది టీజీపీఎస్సీ.
గ్రూప్1 ఆరోపణలపై ఇటు టీజీపీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్ స్పందించారు. TGPSCపై నిరాధార ఆరోపణలు సరికాదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆధారాలుంటే నిరూపించాలంటూ సవాల్ చేవారు.
మొత్తంగా… గ్రూప్1 పరీక్షలపై వస్తున్న అసత్యాలను నమ్మోద్దంటోంది టీజీపీఎస్పీ. అంతా ప్రోటోకాల్ ప్రకారమే జరిగిందని చెబుతోంది. మరీ టీజీపీఎస్సీ ప్రకటనపై పొలిటికల్ రియాక్షన్స్ ఎలా ఉండబోతోతున్నాయో చూడాలి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..