Governor Tamilisai Soundararajan Badradri Tour: మేడారంలో ఏం జరిగిందో యాదాద్రిలో అదే జరిగింది. యాదాద్రిలో ఏం జరిగిందో ఇప్పుడు భద్రాద్రిలోనూ అదే జరిగింది. గవర్నర్ వచ్చినా ప్రొటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్, పోలీసు సూపరిండెంట్ రిసీవ్ చేసుకునేందుకు రాలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు ఏర్పడిన అగాధం పట్టాభిషేక ఘట్టం సాక్షిగా మరోసారి బయటపడింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భద్రాచలం సీతారామ చంద్ర స్వామిని దర్శించుకున్నారు. శ్రీరామ పట్టాభిషేకాన్ని తిలకించారు. అయితే గవర్నర్‌కు ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం లభించలేదు. జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ సునీల్ దత్ గైర్హాజరయ్యారు. గవర్నర్ వెంట భద్రాచలం ఎమ్మెల్యే పోదేం వీరయ్య మాత్రమే ఉన్నారు.
రాష్ర్ట గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు అవమానాలే ఎదురవుతున్నాయి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు అధికార పార్టీ టీఆర్ఎస్ గవర్నర్ తమిళిసై మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాజ్యాంగ బద్ధంగా నియమితులైన గవర్నర్‌కు అడుగడుగునా అవమానాలే కనిపిస్తున్నాయి. ఆమె పర్యటనకు హెలికాప్టర్ సమకూర్చాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. దీంతో ఆమె రైలు, రోడ్డు మార్గాల ద్వారా భద్రాచలం వెళ్లి శ్రీరాముల పట్టాభిషేకంలో పాల్గొన్నారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి తమిళిసై పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జైలింగేశ్వరస్వామి ఆలయాన్ని కూడా సందర్శించారు తమిళిసై. దమ్మపేట మండలం నాచారం గ్రామంలో ఉన్న ఈ గుడికి వచ్చిన గవర్నర్‌కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.
ఇదిలావుంటే, ప్రొటోకాల్ వివాదంపై మాట్లాడడానికి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నిరాకరించారు. పట్టాభిషేకం చూసేందుకు వచ్చానని, తనకు రాముడి ఆశీసులు లభించాయన్నారు. స్వామి ఆశీస్సులతో అందరూ బాగుండాలి.. కోవిడ్ అంతం కావాలని కోరుకునన్నారు. అందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలి.. బూస్టర్ డోస్ తీసుకోవాలని గవర్నర్ ఈ సందర్భంగా కోరారు. ప్రోటోకాల్, తెలంగాణ ప్రభుత్వం గురించి ఇపుడు మాట్లాడనని స్పష్టం చేశారు.
అయితే, రాష్ట్ర ప్రభుత్వం తనను అవమానిస్తోందంటూ గవర్నర్ తమిళిసై రీసెంట్‌గా ఢిల్లీలో తీవ్ర విమర్శలు చేశారు. గవర్నర్ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఆమె బీజేపీ కార్యకర్తలా మారిపోయారని తెలంగాణ మంత్రులు, టీఆర్‌ఎస్ నాయకులు కౌంటర్ ఇచ్చారు. రాజ్ భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య ఉన్న విభేదాలు ఎంత తీవ్రంగా మారిపోయాయో ఈ ఎపిసోడ్‌తో తేలిపోయింది.ఇదిలావుంటే, గవర్నర్ అయినా ఇంకెవరైనా ఐ డోన్ట్ కేర్ అనే ధోరణిలో కేసీఆర్ వెళుతున్నారని విమర్శించారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. భద్రాచలం వెళతానని ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడే చెప్పారు గవర్నర్ తమిళిసై. హెలికాప్టర్‌లో కాకుండా రైలులోనో, కారులోనో వెళతానన్నారు. అన్నట్టుగానే ఆమె భద్రాచలం వెళ్లారు. మేడారంలో, యాదాద్రిలో జరిగినట్టే భద్రాద్రిలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య విభేదాలు నెక్స్ట్ ఏ టర్న్ తీసుకుంటాయో మరి!