Telangana: రైతులకు మరో శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్.. ఇది కదా కావాల్సింది
ఇటీవల రుణమాఫీ కాని రైతులకు శుభవార్త వచ్చేసింది. నవంబర్ 30వ తేదీన వారి ఖాతాల్లో డబ్బులు వేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. వ్యవసాయ శాఖాధికారులు గత 3 నెలలుగా రైతుల వివరాలు సేకరించారని… తప్పులను సరిచేసినట్లు సీఎంఓ నుంచి సమాచారం అందింది.
ఏడాది పాలన పూర్తిచేసుకుంటున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం..రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో రైతులకు మరో శుభవార్త వినిపించేందుకు తెలంగాణ సర్కారు సమాయత్తమవుతోంది. మొత్తం 3 విడతల్లో రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసింది..రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. అర్హులైన రైతుల ఖాతాల్లో మొత్తం 18 వేల కోట్ల రూపాయలు జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే అర్హతలు ఉన్నా కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదు. రేషన్ కార్డులు లేకపోవడం, ఆధార్, బ్యాంకు ఖాతాల్లో పేర్లు, నంబర్లు తప్పుగా ఉండటం వంటి కారణాలతో వారికి మాఫీ వర్తించలేదు. ఇలాంటి వారి సంఖ్య 3 లక్షల పై చిలుకు వరకు ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు.. అలాంటి రైతుల వివరాలు సేకరించారు. ఆ రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసే అవకాశం ఉంది. ఈ నెల 30న పాలమూరులో జరిగే రైతుసభలో రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేస్తారని చెబుతున్నాయి..ప్రభుత్వ వర్గాలు.
రైతు భరోసా పథకంపైనా కీలక నిర్ణయం తీసుకోనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఏడాది రైతు భరోసా కింద ఇచ్చే 15 వేలకు బదులు..రెండు లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ వర్తింపజేసే అవకాశం ఉందంటున్నాయి..ప్రభుత్వ వర్గాలు. దాంతో రైతులకు మరింత మేలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.