Telangana: చీమలపాడు బాధితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. 2 వారాల్లోనే నష్టపరిహారం చెల్లింపు..

|

Apr 26, 2023 | 5:30 AM

BRS Party: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. అగ్నిప్రమాద మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు ఆపన్నహస్తం అందించింది. ప్రమాదం జరిగిన రెండు వారాల్లోనే బాధితులకు నష్ట పరిహారం చెల్లించింది తెలంగాణ ప్రభుత్వం.

Telangana: చీమలపాడు బాధితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. 2 వారాల్లోనే నష్టపరిహారం చెల్లింపు..
Cheemalapadu Brs Party
Follow us on

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో ఈ నెల 12న‌ జ‌రిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన మృతుల‌కు, గాయప‌డిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఆప‌న్నహ‌స్తం అందించింది. న‌లుగురు మృతుల కుటుంబాల‌కు 10 ల‌క్షల చొప్పున‌, గాయ‌ప‌డిన ఐదుగురికి రెండున్నర ల‌క్షల చొప్పున మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అందజేశారు. కలెక్టరేట్‌లో జ‌రిగిన ఈ కార్యక్రమంలో ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయ‌క్‌, ఎమ్మెల్సీ తాతా మ‌ధు, జిల్లా క‌లెక్టర్ వీపీ గౌతం, చీమ‌లపాడు స‌ర్పంచ్ మాలోత్ కిశోర్ పాల్గొన్నారు.

చీమలపాడు ఘటన బాధాకరమన్నారు మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్. ఈ ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన న‌లుగురి కుటుంబాలు, గాయ‌ప‌డిన ఐదుగురి కుటుంబాల‌ను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంద‌న్నారు. బాధిత కుటుంబాల‌ను మరోసారి ప‌రామ‌ర్శించి ఓదార్చారు మంత్రి పువ్వాడ. ఘ‌ట‌న జ‌రిగిన రెండు వారాల్లోనే బాధిత కుటుంబాల‌ను ఆదుకోవాల‌న్న సంక‌ల్పంతో ప్రభుత్వం న‌ష్ట ప‌రిహారం అంద‌జేసింద‌న్నారు. ప్రమాదం జ‌రిగిన‌ప్పటి నుంచి బాధితుల సంక్షేమంపై ప్రభుత్వం నిత్యం దృష్టి సారించింద‌ని చెప్పారు. బాధితుల‌కు న‌ష్ట ప‌రిహారం ఇవ్వడంతోపాటు మృతుల కుటుంబాల‌కు డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కూడా ఇస్తామ‌ని ప్రకటించారు మంత్రి పువ్వాడ. ఈ విష‌య‌మై జిల్లా క‌లెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశామ‌ని చెప్పారు.

అలాగే.. అంగ విక‌లాంగులైన వారికి కృత్రిమ అవ‌య‌వాలు అంద‌జేసి, వారి కుటుంబాల జీవ‌నోపాధికి త‌గు చ‌ర్యలు తీసుకుంటామ‌న్నారు. మృతులు, గాయ‌ప‌డిన వారి పిల్లల‌కు.. వారు కోరుకున్న చోట రెసిడెన్షియ‌ల్ స్కూల్‌, కాలేజీల్లో తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఉచిత విద్య అందిస్తామ‌ని హామీ ఇచ్చారు.

ఇక.. ఈ నెల 12న చీమ‌లపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ స‌మ్మేళ‌నం సంద‌ర్భంగా అగ్నిప్రమాదం జరిగింది. బీఆర్ఎస్‌ కార్యక‌ర్తలు బాణాసంచా కాలుస్తుండ‌గా, నిప్పు ర‌వ్వలు ఓ గుడిసెపై ప‌డ‌టంతో నిప్పంటుకుని ఘోర విషాదం చోటుచేసుకుంది. పూరి గుడిసెలోనున్న గ్యాస్ సిలిండ‌ర్ పేల‌డంతో న‌లుగురు మ‌ర‌ణించ‌గా, ఐదుగురికి తీవ్ర గాయాల‌య్యాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..